రాజీనామా చేసిన ఎంపీలు పార్లమెంట్‌కు ఎలా వెళ్తారు?

అధిష్టానమే కాదు మీరు మోసం చేస్తున్నరు
ఉత్తుత్తి మాటలను ప్రజలు గమనిస్తున్నరు
తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు.. కేంద్రం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ఎప్పటికప్పుడు దాటవేత ధోరణి అవలంబిస్తోందని పేర్కొంటూ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈసారి తాము చేయబోయేవి ఉత్తుత్తి రాజీనామాలు కావాని స్పీకర్‌ ఫార్మాట్‌లోనే లేఖలు అందజేస్తామని బీరాలు పలికారు. అదే సమయంలో వారికి ఢిల్లీ పెద్దల నుంచి పిలుపువచ్చిందని హడావుడి చేశారు. కట్టగట్టుకొని ఢిల్లీ వెళ్లారు. వీళ్లను పట్టించుకునే వారే కరువయ్యారు. పార్లమెంట్‌లో ఎఫ్‌డీఐల బిల్లు నెగ్గేందుకు తమతో సంప్రదింపులకు దిగిన అధిష్టానమేనా ఇలా చేస్తోంది అని షాక్‌ తిన్నారు. ఓ రెండు గడపలు ఎక్కి దిగి బయటికి వచ్చి గొట్టాల ముందు చేరిపోయారు. తాము రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని, స్పీకర్‌ ఫార్మాట్‌లోని లేఖలను పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి అందజేస్తామని చెప్పేశారు. కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ తనతో సహా ఎంపీలు డాక్టర్‌ వివేకానంద, మందా జగన్నాథం, గుత్తా సుఖేందర్‌రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిల రాజీనామా లేఖలు తీసుకువెళ్లి టెన్‌ జన్‌పథ్‌లో అప్పగించాడు. ఈ తతంగమంతా జరిగి నెలరోజులు దాటింది. అమ్మ దయచూపలేదు. వీరి రాజీనామా లేఖలు కనీసం పరిశీలనకు కూడా నోచుకోలేదు. తెలంగాణ కోసం ఏదైనా చేయడానికి రెడీ అంటూ అంతకుముందు ఎగెరెగిరి పడ్డ ఎంపీలు తాము ఇచ్చిన రాజీనామాలు ఆమోదింపజేసుకోవడానికి ఇసుమంతైనా ప్రయత్నించలేదు. కనీసం అధిష్టానం పెద్దల్లో ఒకరిద్దరిని కలిసి తాము ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో చెప్పే ప్రయత్నం చేయలేదు. అటువైపు నుంచి అంతే తెలంగాణ నేతలు పదవులు వదిలి ఉండబోరు, కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా పార్టీ పెద్దలు లెక్కలేనితనం చూపారు. మన ఎంపీలు కూడా మేం చేసిన రాజీనామాలను ప్రజలేం గుర్తు పెట్టుకుంటారులే అనుకొని పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొంటున్నారు. నేరుగా సమావేశాలకు వెళ్లకుండా మొదటి రోజు మెట్లపై కూర్చొని ప్లకార్డులు పట్టుకొని జాతీయ మీడియాను ఆకర్షించే ప్రయత్నం చేశారు. తద్వారా తాము తెలంగాణ కోసం ఇంకా కొట్లాడుతున్నామనే భావన ప్రజల్లో సజీవంగా ఉండాలని చిన్నపాటి ప్రయత్నం చేశారు. నిజానికి రాజీనామా చేసిన వారు పార్లమెంట్‌ సమావేశాలకు దూరంగా తెలంగాణ ప్రజల పక్షాన ఉద్యమించాలి. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో వ్యవహరించినట్టుగానే ఆందోళన కొనసాగించాలి. కానీ ఎంపీలు ఎంచక్కా పార్లమెంట్‌ సమావేశాలకు హాజరై సాధారణ సభ్యుల్లాగే తమ సీట్లలో కూర్చుండిపోయారు. గల్ఫ్‌ దేశాల్లో విజిట్‌ వీసాలతో చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి రప్పించాలని కోరారు. పార్లమెంట్‌ సభ్యులుగా వారు చేసిన ఈ ప్రయత్నాన్ని తప్పు బట్టడం లేదు. కానీ రాజీనామా చేసినట్టు ప్రకటించి, ఆ రాజీనామాలు ఆమోదింపజేసుకునే అవకాశం ఉన్నా అందుకు కనీస ప్రయత్నాలు చేయకపోవడంలో ఆంతర్యమేమిటి? ఎంపీలు రాజీనామా ఆమోదానికి ప్రయత్నిస్తే అధిష్టానంపై ఒత్తిడి పెరిగేది. తెలంగాణపై యూపీఏలోని భాగస్వామ్య పక్షాలు నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ), రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డీ), యూపీఏకు బయటినుంచి మద్దతిస్తున్న బహుజన సమాజ్‌పార్టీ (బీఎస్పీ) తెలంగాణపై తేల్చాలని కోరుతున్న సమయంలో ఎంపీలు ఒత్తిడి పెంచితే దాని ప్రభావం మరోలా ఉండేది. అధిష్టానం తెలంగాణ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోందని, యూపీఏ సమావేశంలో తెలంగాణపై చర్చించడం దీనికి నిదర్శనమని మంత్రుల్లా నీతి లేని మాటలు మాట్లాడితే ఎంపీలపై ఉన్న కొద్ది పాటి గౌరవం తగ్గి వారంటే చులకన భావం ఏర్పడుతుంది. ఇప్పటిదాకా ఎంపీలు తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్నారనే పేరుంది. కానీ ఇప్పుడు రాజీనామా డ్రామాలు చేసి పార్లమెంట్‌ సమావేశాలకు హాజరైతే వారికి, పదవులు పట్టుకువేలాడుతున్న మంత్రులు, విప్‌లు, ఎమ్మెల్యేలకు తేడా ఉండబోదు. ఇంతకాలం కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే తెలంగాణకు మోసం చేస్తోంది. ఇప్పుడు ఆ మోసగాళ్ల జాబితాలో ఎంపీలు చేరిపోయారు. రాజీనామా చేసి పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొంటున్న వారిని మోసగాళ్లు అనడం పెద్దమాటేమికాదు. ఆ మాటకొస్తే మొత్తం కాంగ్రెస్‌ పార్టీనే మోసగాళ్ల కూటమి, మోసగాళ్ల సంఘం అనడానికి ఒక్క తెలంగాణ బిడ్డ వెనుకాడబోడు. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్‌ పార్టీ అవలంబించిన మోసపూరిత విధానాలను ఎవరూ మర్చిపోలేదు, మర్చిపోబోరు. 1969లో మా గడ్డ మాకు దక్కాలని, స్వపరిపాలన, ఉద్యోగాలు, వనరుల రక్షణ కోసం పోరాడిన 369 మంది ఇదే కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం పొట్టనబెట్టుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అవే మోసపూరిత విధానాలు పునరావృత్తం చేస్తోంది. 2009 డిసెంబర్‌ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చెప్పి మళ్లీ పాత పాటే పడింది. దీనిని నిరసిస్తూ వెయ్యి మందికి పైగా తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. అయినా పాలకపక్షంలో స్పందన లేదు. మొన్నటికి మొన్న తెలంగాణ అంశాన్ని నెల రోజుల్లోగా తేల్చేస్తామని చెప్పి మళ్లీ మోసమే చేసింది. అదే సమయంలో ఎంపీలకు కాంగ్రెస్‌ మోసాల రాజకీయ ఒంటబట్టినట్లుంది. తామేమి తక్కువ తిన్నామన్నట్లు పదవులకు రాజీనామా చేసినట్లు గొప్పలు చెప్పి తర్వాత మాట తప్పారు. అంతటితో ఆగకుండా పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొంటూ తామూ కాంగ్రెస్‌ మోసపు విధానాలకు వారసులమే అని చాటిచెప్పారు.