రాజ్యసభకు నలుగురి నామినేట్‌

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉత్తర్వులు

న్యూఢిల్లీ,జూలై14(జ‌నం సాక్షి): రాజ్యసభకు నలుగురు ప్రముఖుల్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నామినేట్‌ చేశారు. రాజ్యసభకు కొత్తగా నియమించినవారిలో రైతు నేత రామ్‌ షాకాల్‌, రచయిత రాకేశ్‌ సిన్హా, శిల్పి రఘునాథ్‌ మహాపాత్ర, క్లాసికల్‌ డ్యాన్సర్‌ సోనాల్‌ మాన్‌సింఘ్‌ ఉన్నారు. అయితే ఈసారి ఫిల్మ్‌ ఇండస్ట్రీకి చెందిన ఒకర్ని కూడా రాజ్యసభకు నామినేట్‌ చేయకపోవడం విశేషం. కొత్తగా రాజ్యసభకు ఎంపీలుగా నియమితులైన నలుగురూ వేర్వేరు రాష్ట్రాలకు చెందినవారు. ఆ నలుగురూ తమ తమ రంగాల్లో నిష్ణాతులు. 2019లో జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల కంటే ముందు చోటుచేసుకున్న కీలక పరిణామం ఇది. రైతు నేత రామ్‌ షాకాల్‌ది ఉత్తరప్రదేశ్‌ కాగా, రచయిత రాకేశ్‌ సంఘపరివార్‌తో పనిచేశారు. ఢిల్లీ వర్సిటీలో ఆయన ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. సోనాల్‌ మాన్‌సింఘ్‌ దేశంలో విఖ్యాత డ్యాన్సర్‌గా గుర్తింపు పొందారు. శిల్పి రఘునాథ్‌ మహాపాత్ర పూరిలోని జగన్నాథుడి ఆలయంలో పనిచేస్తున్నారు.