రానున్న 48గంటల్లో హైద‌రాబాద్‌కు వర్షసూచన

నేటి నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు ఒడిషా తీరప్రాంతాన్ని ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.  అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.  దీని ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

అటు మరో రెండురోజులు తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడతాయని చెప్పింది.అటు ఆదివారం హైదరాబాద్ నగరంతో సహా పలు జిల్లాలో వర్షాలు కురిశాయి. సికింద్రాబాద్ సర్కిల్‌, పాతబస్తీ, శేరిలింగంపల్లి, కూకట్‌ పల్లి, కుత్బుల్లాపూర్, అల్వాల్, కంటోన్మెంట్, కాప్రా, మల్కాజిగిరి, ఉప్పల్, ఓయూ, రాజేంద్రనగర్, శంషాబాద్, శివరాంపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మెహిదీపట్నం, నాంపల్లి, అమీర్‌పేట, ఖైరతాబాద్, బేగంపేట, అత్తాపూర్ లో మోస్తరు వాన పడింది. మెదక్ జిల్లా నర్సాపూర్, శివంపేట, కౌడిపల్లి,రేగోడ్, అల్లాదుర్గం లో మోస్తారు వర్షం కురిసింది. ఇక శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రంలో అత్యధికంగా భూపాలపల్లి జిల్లాలో 7 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. కొత్తగూడెంలో 6 సెంటిమీటర్లు, దోమలో 5, మాక్లూరు, ఆలంపూర్‌ లో 4 సెంటిమీటర్ల చొప్పున.. లింగపేట, గట్టు చెన్నూరు, ములుగు, వర్ని, కొల్లాపూర్‌ లో 3 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్‌, యాచారం, భీంగల్‌, ఎల్లారెడ్డి, హన్మకొండ, భిక్కనూరులో సెంటిమీటర్ చొప్పున వర్షం కురిసింది.

మరోవైపు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఆదివారం ఎగువ నుంచి ఎస్పారెస్పీకి వరద భారీగా పెరిగింది. తాలిపేరు ప్రాజెక్టు పది గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. కడెం జలాశయం నీటితో కళకళలాడుతున్నది.  గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నది. ఆదివారం ఉదయం 2,333 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, సాయంత్రం ఒక్కసారిగా 26,375 క్యూసెక్కులకు పెరిగింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 19.782 టీఎంసీల వరద వచ్చి చేరింది. అటు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 1247 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు  కాగా ప్రస్తుతం 1385.00 అడుగులకు చేరింది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరి జలకళను సంతరించుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద వచ్చి చేరడంతో జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నది. అదనంగా వచ్చే నీటిని దిగువ గోదావరిలోకి 6,122 క్యూసెక్కులు వదిలారు. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాలిపేరు ప్రాజెక్టుకు వరదపోటు తగిలింది. ఆదివారం ఉదయం తక్కువగా ఉన్న వరద సాయంత్రానికి భారీగా పెరిగింది. డ్యాంలోకి ఎగువప్రాంతం నుంచి వరద వస్తుండటంతో 10 గేట్లు ఎత్తి 35 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఆదివారం ప్రాజెక్టులోకి 6,386 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. 30 టీఎంసీల నీటి సామర్థ్యం గల డ్యాంలో ప్రస్తుతం 19.8 టీఎంసీల నీరుంది.