రాయచూరులో ఐదుగురు వైద్య విద్యార్థులకు కరోనా

హసన్‌లో వందమంది నర్సింగ్‌ విద్యార్థులకు పాజిటివ్‌
కేసుల పెరుగదలతో అప్రమత్తం అయిన కర్నాటక
బెంగళూరు,అగస్టు7(జనంసాక్షి): రాయచూరు జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ బోధన ఆస్పత్రిలోని ఐదుగురు వైద్య విద్యార్థులకు కొవిడ్‌ పాజిటివ్‌గా శుక్రవారం తేలింది. జూలై 26 నుంచి తరగతులను ప్రారంభించారు. తరగతులకు హాజరయ్యే విద్యార్థులందరూ కొవిడ్‌ నెగెటివ్‌ ద్రువపత్రాన్ని అందజేశారని అనంతరం నిర్వహించిన పరీక్షల్లో ఐదుగురికి కొవిడ్‌ పాజిటివ్‌ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఒకే కాలేజీకి చెందిన వందమంది నర్సింగ్‌ విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయింది. హాసన్‌ జిల్లాలోని ఓ ప్రైవేట్‌ నర్సింగ్‌ కాలేజీలో శుక్రవారం 21 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. కాలేజీలోని 48 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా 21 మందికి పాజిటివ్‌ అని నిర్దారణ అయింది. పాజిటివ్‌ వచ్చిన విద్యార్థులంతా గత నెల 17 నుంచి 21 మధ్య కేరళ నుంచి వచ్చారని అధికారులు గుర్తించారు. ఇక పాజిటివ్‌ నిర్దారణ అయినవాళ్లలో ఎవరికీ ఎటువంటి సింప్టమ్స్‌ లేవని చెప్పారు. ఒకే కాలేజీలో 21 మంది విద్యార్థులు కరోనా బారినపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దాని చుట్టుపక్కల ఉన్న 9 మెడికల్‌ కళాశాల ల్లోని 900 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 100 మందికి కరోనా నిర్దారణ అయింది.వీరిలో చాలామందికి లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. వారిలో 24 మంది మొదట పాజిటివ్‌గా తేలిన 21 మందికి ప్రైమరీ కాంటాక్ట్స్‌ అని ఆరోగ్య అధికారి డాక్టర్‌ విజయ్‌ వెల్లడిరచారు. ఆ 24 మంది తొలి డోసు టీకా వేయించుకున్న వారేనని చెప్పారు. ఇదిలావుంటే బెంగళూరు, దక్షిణ కన్నడ
జిల్లాల్లో కొవిడ్‌ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 1,805 మందికి పాజిటివ్‌ నిర్దారణ కాగా బెంగళూరులో 441, దక్షిణకన్నడలో 411మందికి పాజిటివ్‌ ప్రబలింది. ఇక ఉత్తరకన్నడలో 153, హాసన్‌లో 103 కేసులు నమోదు కాగా, బాగల్కోటె, యాదగిరి, గదగ్‌లలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. పది జిల్లాల్లో పదిమందిలోపు బాధితులు నమోదు కాగా ఇతర జిల్లాల్లో వందలోపు నమోదయ్యారు. 1,854మంది కోలుకోగా 36మంది మృతి చెందారు. బెంగళూరులో 7మంది మృతి చెందగా కోలారులో 5, మైసూరులో నలుగురు మృతి చెందారు. మూడు జిల్లాల్లో ముగ్గురు చొప్పున, నాలుగు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, మూడు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. 17జిల్లాల్లో ఒకరు కూడా మృతి చెందలేదు. ప్రస్తుతం 30 జిల్లాల్లో 24,328మంది చికిత్సలు పొందుతుండగా అత్యధికంగా బెంగళూరులో 8,560మంది ఉన్నారు.