రాయచోటి ప్రాంతానికి ఝరికోనే శరణ్యం

కడప,జూన్‌22(జ‌నం సాక్షి ): నిత్యం కరువుకాటకాలకు నిలయమైన రాయచోటి నియోజకవర్గంలో వర్షాధారంగానే పంటలు పండుతాయి. సాగునీటి వసతులు లేవు. కేవలం చిన్నచిన్న కుంటలు, చెరువుల కిందే పంటలు సాగు చేస్తారు. ఈ నేపధ్యంలో సంబేపల్లె, సుండుపల్లె మండలాలకు సాగునీరిందించే ఉద్దేశంతో సంబేపల్లె మండలంలో ఝరికోన ప్రాజెక్టును నిర్మించారు. ఝరికోన ప్రాజెక్టు విషయంలో స్థానిక నేతలు సరిగా స్పందించలేదనే విమర్శలు ఉన్నాయి. ఝరికోన నుంచి పీలేరుకు నీటిని తరలిస్తే సంబేపల్లె మండల రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని తెలిసినా గతంలో గట్టిగా మాట్లాడలేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో ఈ ఏడాది జాతీయ ఆహార భద్రతా పథకం కింద అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు డ్వామా అధికారులు చెప్పారు. విత్తనశుద్ధి, పంట చుట్టూ కంచెలు వేయడం, అంతర్‌పంటలుగా కంది, ఆముదం వేయడం, జిప్సం వాడకం అనే అంశాలను విశదీకరించారు. పప్పుదినుసులను పండించేందుకు ఆత్మ పథ కం కింద ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. అమలయ్యే కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. త్వరలోనే రైతులను ఇతర ప్రాంతాల్లో వ్యవసాయ పనుల పరిశీలనకు తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. ఇప్పుడు సాగునీళ్లు లేక పొలాలు బీళ్ళుగా పెట్టుకోవాల్సి వచ్చిందని రైతులు బాధపడుతున్నారు. ఈ ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు ఎవరికి వారు రైతుల గురిచి పట్టించుకోకపోవడంతో నష్టపోయామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.