రాష్ట్రంలో స్తంభించిన పాలన
– సిపిఎం ప్రధాన కార్యదర్శి రాఘవులు
హైదరాబాద్, జూలై 10 : రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించి పోయిందని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వి.రాఘవులు ఆరోపించారు. రాష్ట్ర మంత్రి వర్గం కుక్కలు చింపిన విస్తరిలా తయారు అయిందని ఆయన హైదరాబాద్‌లో మంగళవారం నాడు మీడియాతో అన్నారు. నేరాలకు పాల్పడిన ఒక మంత్రి జైలులో ఉండగా, మరికొందరు బయట తిరుగుతున్నారని అన్నారు. మద్యం సిండికేట్లతో సంబంధం ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సరైందని కాదని అన్నారు. 26 అక్రమ జీవోలకు కారకులైన మంత్రులను, మంత్రి వర్గంలో కొనసాగించడం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తప్పు చేస్తున్నారని రాఘవులు ఆరోపించారు.
అవినీతి, అక్రమాలకు పాల్పడిన మంత్రులతో న్యాయ సహాయం అందించడంతో ప్రభుత్వం నిజ స్వరూపం బట్టబయలైందని అన్నారు. ప్రజాధనంతో అవినీతి, అక్రమాలకు పాల్పడిన మంత్రులను కాపాడడం ఏమి న్యాయమని మండిపడ్డారు. ప్రజాధనాన్ని దోచుకున్న ప్రభుత్వం తిరిగి ఆ ధనంతోనే అవినీతి మంత్రులను కాపాడేందుకు ప్రయత్నిస్తోందని రాఘవులు విమర్శించారు. బలం ఉంది కదా అని ప్రభుత్వం ఇష్టమొచ్చిన రీతిలో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. పదవులను, అధికారాన్ని కాపాడుకునేందుకే లక్ష్యంగా ఉందని ఆయన విమర్శించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన మంత్రులను కాపాడినంత మాత్రాన వారు ప్రజల ముందు నిర్దోషులుగా ఉండలేరని అన్నారు.
రాష్ట్రంలో పాలన ముఠాలు, వ్యక్తుల గుంపుగా మారిందని రాఘవులు ఆరోపించారు. ఒకవైపు రైతన్నలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం వ్యవహరించడం శోచనీయమన్నారు. రాష్ట్రపతి ఎన్నికను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారే తప్ప, ప్రజా సమస్యలపై ఏ మాత్రం శద్ద్ర చూపడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. అధికార పార్టీకి చెందిన నేతలే ఎరువులు, విత్తనాలను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని వారిపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణ విషయమని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలసివచ్చే అన్ని పార్టీలతో కలసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రాఘవులు అన్నారు. విద్యుత్ కోతతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా ద్వంద్వ విధానాలను అవలంబిస్తోందని ఆయన విమర్శించారు. కేవలం అధికారమే లక్ష్యంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోందే తప్ప, ప్రజా సమస్యలపై ఏ మాత్రం దృష్టి సారించడం లేదని రాఘవులు ఆరోపించారు.