రాష్ట్రం సస్యశ్యామలం కావడం విపక్షాలకు ఇష్టం లేదు: ఎమ్మెల్యే
నిజామాబాద్,మే4(జనంసాక్షి): ముఖ్యమంత్రి కెసిఆర్ పట్టుబట్టి గోదావరి జలాలపై నిర్మిస్తున్న ప్రాజెక్టులతో రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. సిఎం కెసిఆర్ కృషికి తోడు విపక్షాలు కూడా మద్దతు ఇవ్వాలని, ఆంధ్రా నేతల తీరును అడ్డుకోవాలని అన్నారు. సిఎం కెసిఆర్ భగీరథ ప్రయత్నం కారణంగా రానున్న రెండేళ్లలో తెలంగాణా రాష్ట్రంలో సాగునీటి సమస్య తీరబోతోందని అన్నారు. ఓవైపు మిషన్ కాకతీయ,మరోవైపు మిషన్ భగీరథ, ప్రాజెక్టుల నిర్మాణం కారణంగా తెలంగాణ రూపురేఖలు మారనున్నాయని అన్నారు. రెండువేల టీఎంసీలు గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నా పట్టించుకోని కాంగ్రెస్, తెదేపా నాయకులు నేడు విమర్శిస్తున్నారని తెలిపారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల అంచనాలపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో అదనంగా మరో ఐదు జిల్లాలకు 18 లక్షల ఎకరాల స్థిరీకరణ పెరుగుతుందన్నారు.
ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు పార్టీలో తెలంగాణ టిడిపి నాయకులు ఎలా కొనసాగుతారో తేల్చుకోవాలన్నారు. ముందుగా బాబును నిలదీసి మాట్లాడాలన్నారు. రాష్ట్రంలో తాగునీటి సమస్య నివారణకు రూ.400 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసినట్లు వివరించారు. పాలేరు ఎన్నికల్లో తెరాస విజయాన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. వైకాపా పూర్తిగా అంతర్ధానం అయ్యిందని, టిడిపికి కూడా అదే గతిపట్టడం ఖాయమన్నారు. ఇలాగే విమర్శలు చేస్తూ పోతే కాంగ్రెస్ పార్టీకి కూడా అదే గతి పడుతుందని అన్నారు. కనీసం ప్రాజెక్టుల విషయంలో అయినా విపక్షనేతలు కలసికట్టుగా ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలన్నారు. లేకుంటే ప్రజాకోర్టులో వారికి శిక్ష తప్పదని జీవన్ రెడ్డి అన్నారు.