రాష్ట్రపతి అభ్యర్తి ఎంపికపై ఎన్డీఏలో అయోమయం
కుదరని ఏకాభిప్రాయం
న్యూఢిల్లీ :
రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఆదివారం జరిగిన ఎన్డీయే సమావేశం అర్ధంతరంగా ముగిసింది. బీజేపీ సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు నితిన్‌గడ్కరి, సుష్మాస్వరాజ్, ఎన్డీయే కన్వీనర్ శరద్‌యాదవ్ తదితరులు హాజరయ్యారు. సమావేశంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో శరద్‌యాదవ్ మధ్యలోనే బయటకు వచ్చేశారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో ఎల్‌కె అద్వానీ చర్చించారని శరద్‌యాదవ్ చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించిన తరువాతే ఎన్డీయే తన అభ్యర్థిని ప్రకటిస్తుందని ఆయన అన్నారు. ఏకాభిప్రాయం సాధించే వరకు చర్చల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. సమావేశంలో భిన్నా భిప్రాయాలు వ్యక్తమయ్యాయని చెప్పారు. యూపీయే అభ్యర్థి ప్రణబ్ ముఖర్జిపై ఎన్డీయే అభ్యర్థిని పోటీకి నిలపాలని కొందరు, పోటీ వద్దని మరికొందరు అభిప్రాయపడ్డారని చెప్పా రు. ఒక దశలో ప్రణబ్‌పై పోటీ పెడితే ఇబ్బం దికర పరిస్థితి ఎదురవుతందనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. బీజేడీ, జేడీల మధ్య రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై భిన్నాభిప్రాయాలు వినిపించాయి. సమావేశం దాదాపు రెండు గంటలకు పైగా జరిగినా అభ్యర్థి ఎంపికపై ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఎన్డీయే సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదన్న విషయం తెలుసుకున్న ఎన్‌సీపీ నేత పీఏ సంగ్మా రాష్ట్రపతి అభ్యర్థిగా తనకు మద్దతు ఇవ్వాలంటూ త్రుణమూల్ కాంగ్రెస్ నేత, ఎన్డీయే నేతలను కోరారు. అయితే ఎన్డీయే తమ అభ్యర్థిగా సంగ్మాను కాని, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను కానిప్రతిపాదించే ఆలోచన చుట్టూనే చర్చలు సాగించింది. కలాం పోటీకి విముఖత వ్యక్తం చేయడంతో సంగ్మాను బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే విషయంపై కూడా ఎన్డీయే సమావేశంలో నేతలు మల్లగుల్లాలు పడ్డారు. గిరిజన నేతగా సంగ్మాను, లేక మైనారిటీ నేతగా కలాం పేర్లను నిశితంగా పరిశీలించారు. అయితే సంగ్మాకు సొంత పార్టీ ఎన్‌సీపీ నుంచే మద్దతు లభించకపోవడం ఆయనకు ఎదురుదెబ్బ. అంతేకాక కలాంను తప్ప తాము మరో అభ్యర్థికి మద్దతు ఇవ్వబోమంటూ త్రుణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఎన్డీయేలో అయోమయం నెలకొంది.