రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ ప్రధానాంశం కావాలి
టీజేఎఫ్ దశాబ్ధి ఉద్యమమహాసభలో ,
కోదండరామ్, భూమయ్య,గద్దర్, అల్లంనారాయణల పిలుపు
హైదరాబాద్, జూన్ 24 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణకు రాష్ట్రపతి ఎన్నికల రూపంలో మరో చక్కని అవకాశం లభించిందని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (టీజేఎఫ్) తీర్మానం చేసింది. టీజేఎఫ్ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన మహాసభలో తెలంగాణ ప్రజాసంఘాలు, ఉద్యమకారులు, జర్నలిస్టులు, ఇతర వక్తలు ముక్తకంఠంతో మద్దతు ప్రకటించారు.
తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఒకలాంటి స్తబ్దత వాతావరణం నెలకొందని, అయితే టీజేఎఫ్ తీసుకున్న నిర్ణయం మరో దఫా ఉద్యమానికి ఊతమిస్తుందన్నారు. మరింత నిర్మాణాత్మకంగా ముందుకెళ్లేందుకు ప్రపంచస్థాయి ఉద్యమాలతో లోతుగా అధ్యయనం చేస్తున్నామని కోదండరాం చెప్పారు. ఇప్పటి వరకు జరిగిన తెలంగాణ ఉద్యమ దశలను అవలోకించుకుని మరింత విస్తృతాభిప్రాయాలతో ముందుకు సాగుతామన్నారు. ఇందుకుగాను మండలం, డివిజన్, జిల్లాల వారీగా కార్యాచణరకు సంబంధించి అభిప్రాయాలు తీసుకుంటున్నామని తెలిపారు.
తెలంగాణ ప్రజాసంఘం నేత ఆకుల భూమయ్య మాట్లాడుతూ తెలంగాణ విషయంలో యూపీఏ మెడలు వంచేందుకు రాష్ట్రపతి ఎన్నికలు మనకు అందివచ్చిన అవకాశమన్నారు. ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ హయాంలో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న నీలం సంజీవరెడ్డిని ఓడించేందుకు ఇందిరాగాంధీ వీవీ గిరిని బరిలో నిలిపారన్నారు. వీవీ గిరిని గెలిపించేందుకు అప్పుడు రాజమండ్రి కేంద్ర కారాగారాంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీల దగ్గరకు ఇందిరా తన ప్రతినిధి బృందాన్ని సైతం పంపి గిరి గెలిపించుకున్న విషయాన్ని భూమయ్య గుర్తు చేశారు. అలాగే ఇప్పుడు కూడా తమ అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీని గెలిపించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ దిగిరాక తప్పదన్నారు. అందుకే తెలంగాణ అంశాన్ని తేల్చకపోతే ప్రణబ్‌కు ఓటేసేది లేదని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు పట్టుబట్టాలని భూమయ్య పిలుపునిచ్చారు. ఈ విషయమై టీజేఎఫ్ మహాసభ తీర్మానానికి ఆయన మద్దతు ప్రకటించారు. సకల జనుల సమ్మెను మించి సార్వత్రిక సమ్మెకు పథక రచన చేయాల్సిన సమయం ఆసన్నమైందని, హైదరాబాద్‌లో సుమారు మూడు నెలలపాటు రోజుకు రెండు లక్షల మందితో నగర దిగ్బంధనానికి వీలుగా వ్యూహం ఖరారు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
: టీజేఎఫ్ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో నాయకులు రమణారావు, క్రాంతి తదితరులతోపాటు తెలంగాణవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు హాజరయ్యారు.