రాష్ట్రాన్ని మద్యం మాఫియా శాసిస్తోంది సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు
నల్లగొండ, నవంబర్ 20: మద్యం మాఫియా రాష్ట్రాన్ని నాశనంచేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు విమర్శించారు. మంగళవారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని మద్యం మాఫియా ఏలుతోందనే విషయాన్ని కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ లేఖ రుజువు చేస్తోందని అన్నారు. ఈ లేఖపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలోని రైతులకు సాగర్ నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని చేతకాని ముఖ్యమంత్రి పాలిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజాసమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. తుపాన్ బాధితులకు సహాయం చేయడంలో ప్రభుత్వం చేతకాని తనం బయటపడిందన్నారు. అవినీతికి రక్షణగా ప్రభుత్వ పెద్దలను కాపాడేలా ఏసీబీ నివేదిక ఉందని విమర్శించారు. మద్యం సిండికేట్లపై ఏసీబీ దర్యాప్తు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందన్నారు. మద్యం మాఫియా వెనుక ఉన్న బడా బాబుల ప్రమేయంపై ఏసీబీ దర్యాప్తు జరిపిందా? లేదా?, ఒకవేళ జరిపితే కావాలనే వారి పేర్లను తప్పించిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. ఏసీబీ హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో మద్యం మాఫియాలో సూత్రధారుల పేర్లు లేవనే వార్తలు వస్తున్నాయని అన్నారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర,రాష్ట్రాలలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం లేదన్నారు.