రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే…
సిట్ రిపోర్ట్ బయటపెట్టాలి
– జగన్ ఎప్పటికీ సీఎం కాలేరు
– వైసీపీతో కలిస్తే జనసేన కథ ముగిసినట్లే
– ఏపీ పట్ల కేంద్రం ఎందుకు కక్షసాధిస్తుందో బీజేపీ నేతలు చెప్పాలి
– 2నెల 29న కడప జిల్లా బంద్
– విలేకరుల సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విజయవాడ, జూన్25(జనం సాక్షి ) : రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిట్ రిపోర్ట్ బయట పెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విశాఖలో విూడియాతో మాట్లాడుతూ.. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ వ్యగ్యంగా మాట్లాడిన మాటలు ఎంపీ హరిబాబుకు వినపడడం లేదా అని ప్రశ్నిస్తున్నా అన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పుడు చేయడం లేదని విమర్శించారు. కేంద్రం అధికారంలోకి వచ్చి నాలుగేళ్ల కాలంలో ఇచ్చిన హావిూలు ఏవీ అమలు చేయకుండా ఎందుకు మోసం చేస్తుందని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రజల పట్ల కేంద్రం ఎందుకు కక్షగా ఉందో బీజేపీ నేతలు చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈనెల 29న కడప జిల్లా బంద్ ప్రకటించామని, ఈ బందుకు 13 జిల్లాలలో కూడా అఖిలపక్ష పార్టీలు సంఘీభావంగా పాల్గోనాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. విశాఖలో జరిగిన భూ కుంభకోణాలపై వేసిన సిట్ దర్యాప్తు ఇంకా ఎన్నాళ్లు చేస్తారు.. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిట్ రిపోర్ట్ బయట పెట్టాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. వారంలోగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించకపోతే ప్రత్యక్ష ఆందోళన తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల సమస్యలపై సదస్సులు నిర్వహించాలని సీపీఐ, సీపీఎం పార్టీలు
నిర్ణయించాయని తెలిపారు. ఇందుకోసం సీపీఐ, సీపీఎం జాయింట్ కన్వెన్షన్ ఏర్పాటు చేశామన్నారు. జూలై 8న ఈ సదస్సులను విశాఖ నుండి ప్రారంభిస్తున్నామన్నారు. జూలై 10వ తేదీన విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. రాజకీయాలలో మార్పు కోసం ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, జనసేన, లోక్ సత్తా, ఆమ్ ఆద్మీ పార్టీలు కలిసి పనిచేస్తాయని రామకృష్ణ తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ధ్యాసంతా ముఖ్యమంత్రి పీఠం విూదే ఉందని విమర్శించారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజాధనాన్ని కొల్లగొట్టారని, ఏపీకి జగన్ ఎప్పటికీ సీఎం కాలేరని ఆయన అన్నారు. వైసీపీతో కలిస్తే జనసేన కథ ముగిసినట్లేనని రామకృష్ణ పేర్కొన్నారు.