రాష్ట్ర విభజన పూర్తిగా జరుగలేదు

4

– హైకోర్టు ఏర్పాటు కోసం ఉద్యమిస్తాం

– ప్రొఫెసర్‌ కోదండరామ్‌

హైదరాబాద్‌,జులై25(జనంసాక్షి):

తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటు ఇంకా అసంపూర్తిగానే ఉందని, హైకోర్టు విభజన తదితర అంశాల కారణంగా ఇలా మిగిలిపోయిందని తెలంగాణ రాజకీయ జెఎసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదడంరామ్‌ అన్నారు. త్వరగా హైకోర్టు విభజన చేయాలని కోరుతూ ప్రజాందోళనలు చేయాల్సిన అవసరముందని  అన్నారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ… హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి కోదండరాంతో పాటు పలువురు న్యాయవాదులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ…. ఇది కేవలం న్యాయవాదుల ఆందోళనకే పరిమితం కావొద్దన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల విభజనకు ఎలాంటి కమిటీ లేదన్నారు. షీలాబేడి కమిటీ కేవలం అస్తుల పంపిణీకే పరిమితమన్నారు. ఇలా అనేక విషయాల్లో ఇంకా కేంద్రం స్పష్టత ఇవ్వలేదన్నారు. విభజన అంశాలను పూర్తి చేయడంలో ఇంకా ప్రతిష్టంభన ఉందన్నారు. హైకోర్టును విభజించాల్సిన కేంద్రం అడుగు ముందుకు వేయడం లేదన్నారు. దీనిపై ఇక ఉమ్మడిగా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి ఉందన్నారు. రాజకీయ ఉద్యమమే కాకుండా ప్రజాందోళన చేయాల్సి ఉందన్నారు. అనేక అంశాల్లో వారు ముందుకు రావడం లేదని, ఒకవేళ ఏదైనా నిర్ణయం తీసుకుంటే అంగీకరించడం లేదన్నారు. ఆగస్ట్‌ 6న దివంతగ జయశంకర్‌ జయంతి రోజును ఆందోళనకు శ్రీకారం చుడదామన్నారు. జెఎసిలో కూడా ఆందోళనపై చర్చిస్తామని, విూరూ చర్చించాలని ఆయన అడ్వకేట్లకు సూచించారు. ఒక్కరుగా లేదా విడిగా ఆందోళన చేయడం వల్ల లాభం లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో చేసిన పోరాట స్ఫూర్తి ఇప్పుడు హైకోర్టు విభజనకు కూడా అవసరమన్నారు.

రైతుల ఆత్మమత్యలపై కేంద్రమంత్రిది బాధ్యతారాహిత్యం: కోదండరాం

రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. రైతులకు బ్యాంకు రుణాలు సరిగా అందడం లేదని విమర్శించారు. విత్తన కంపెనీలు రైతులపై పెత్తనం చేస్తున్నాయన్నారు. రైతు సమస్యలపై కేంద్రమంత్రి నిర్లక్ష్యంగా మాట్లాడారని కోదండరాం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు ఇంతగా బాధ్యతారహితంగా మాట్లాడడం దారుణమన్నారు. జయశంకర్‌ జయంతి నుంచి సంపూర్ణ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.  తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా విభజన చెందలేదని అన్నారు.  శనివారం హైకోర్టు విభజన కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ న్యాయవాదుల జేఏసీ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైకోర్టు, ఉద్యోగుల విభజన కోసం ఆగష్టు 6 తర్వాత ఉద్యమం చేయనున్నట్లు తెలిపారు. ఈ సమస్యల విషయంలో కేంద్రం ముందడుగు వేయడం

లేదన్నారు.  ఇదిలావుంటే  వ్యవసాయ రంగంలో అభివృద్ధి పేరిట విదేశీ దోపిడి జరుగుతుందని రిటైర్డ్‌ జస్టిస్‌ చంద్రకుమార్‌ ఆరోపించారు. రైతులు తప్ప అన్నింట్లోనూ ఉత్పత్తిదారులే ధరలు నిర్ణయిస్తున్నారని తెలిపారు. రైతులు ముఖ్యమా…వ్యాపారులు ముఖ్యమా ప్రభుత్వం ఆలోచించాలన్నారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని కాపాడాలని జస్టిస్‌ చంద్రకుమార్‌ కోరారు. ప్రొఫెసర్‌ కేఆర్‌.చౌదరి మాట్లాడుతూ కేసీఆర్‌ హావిూలు నమ్మి ఓట్లేసిన రైతులకు నిరాశే మిగిలిందన్నారు. జీవో 69 ద్వారా రైతుల భూములు లాక్కోవాలని చూస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు పనికొచ్చే ఒక్క పనిచేయలేదని ఆయన ఆరోపించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. కేసీఆర్‌కు రైతుల కుటుంబాలను పరామర్శించే తీరిక లేదన్నారు. సమస్యల పరిష్కారానికి రైతు జేఏసీ పోరాడుతోందని కేఆర్‌ చౌదరి తెలిపారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశంలోఎంపి  ఆనందభాస్కర్‌, చాడ వెంకట్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.