రాహుల్ శతక్కొట్టుడు
చెన్నై: ఇంగ్లండ్ తో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టులో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ శతకం సాధించాడు. భారత్ తన తొలి ఇన్నింగ్స్స్ లో భాగంగా రాహుల్ 171 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. ఇది రాహుల్ టెస్టు కెరీర్లో నాల్గో సెంచరీ. ఈ రోజు ఆటలో 30 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ను ఆరంభించిన రాహుల్.. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ శతకం సాధించాడు.
అంతకుముందు 60/0 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ కు మంచి ఆరంభం లభించింది. రాహుల్ కు జతగా మరో ఓవర్ నైట్ ఆటగాడు పార్థీవ్ పటేల్(71;112 బంతుల్లో7 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ జోడి 152 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తరువాత పార్థీవ్ తొలి వికెట్ గా అవుటయ్యాడు. అనంతరం పూజారాతో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ నడిపించాడు. అయితే పూజారా(16) ఎంతోసేపు క్రీజ్లో నిలవలేదు.భారత్ స్కోరు 181 పరుగుల వద్ద పూజారా అవుటయ్యాడు. ఆ తరువాత రాహుల్ సెంచరీ సాధించడంతో టీమిండియా 54.0 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.