రిజిస్ట్రేషన్ల జాతర

రేపటి నుంచి భూముల మార్కెట్‌ విలువ పెంపు

నేటితో ముగుస్తున్న గడువు

బారులు తీరిన అమ్మకం, కొనుగోలుదారులు

మంచిర్యాల అర్బన్‌, న్యూస్‌లైన్‌: మంచిర్యాల రిజిస్ట్రేషన్‌ కార్యాలయం శనివారం జాతరను తలపించింది. శనివారం భూముల రిజిస్ట్రేషన్‌ కోసం పెద్ద సంఖ్యలో జనం తరలిరావడంతో కార్యాలయం కిటకిటలాడింది. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి భూముల విలుల పెరుగుతున్న విషయం తెలిసిందే. రిజిస్ట్రేషన్‌ భారం అధికం కానుండడంతో క్రయవిక్రయదారులు రిజిస్ట్రేషన్‌ కోసం వారం రోజులుగా పరుగులు పెడుతున్నారు. వారం రోజుల నుంచి వరుసగా వందల  సంఖ్యలో డార్యుమెంట్లు దాఖలయ్యాయి. శనివారం 450 వరకు డాక్యుమెంట్లు రాగా అమ్మకం, కొనుగోలుదారులు కార్యాలయం ముందు ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాశారు. మందమర్రి, జైపూర్‌, చెన్నూర్‌, వేమనపల్లి, కోటపల్లి మండలాలతోపాటు మంచిర్యాల మండలం హాజీపూర్‌ వరకు మంచిర్యాల రిజిస్ట్రేషన్‌ కార్యాలయం పరిధిలోకి వస్తాయి.

ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశంతో ఒక్కసారిగా క్రయవిక్రయదారులు పోటెత్తడంతో కార్యాలయ సిబ్బంది కూడా సంకటంలో పడ్డారు. వారిని అదుపు చేయడం సాధ్యం కాకపోవడం, కార్యాలయంలోకి దూసుకురావడంతో చివరకు పోలీసులను ఆశ్రయించారు. పోలీసు బందోబస్తు మధ్య క్రయవిక్రయదారులను కార్యాలయంలోకి సంతకాల కోసం అనుమతించారు. సాయంత్రం వరకు కార్యాలయ సిబ్బంది తలుపులు బిగించుకోవడంతో ఒక్కసారిగా కార్యాలయానికి వచ్చిన వారు ఆందోళనకు గురయ్యారు. ఒక్కొక్కర్ని కార్యాలయంలోకి అనుమతించడంలో రద్దీ తగ్గింది. గుడ్‌ప్రైడే రోజున సెలవుదినం అయిన ఉన్నతాధికారుల ఆదేశంతో రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆదివారం కూడా రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. సబ్‌ రిజిస్ట్రార్‌ లింగయ్య సెలవుపై వెళ్లడంతో ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా రామస్వామి  వ్యవహరిస్తున్నారు.

చేతులు మారిన కోట్ల రూపాయలు

రిజిస్ట్రేషన్‌ సందర్భంగా కోట్ల రూపాయలు చేతులు మారాయి. మంచిర్యాలలో భూయుల విలువ ఇప్పటికే విపరీతంగా పెరుగగా మరింత ప్రియం అవుతుందనే ప్రచారంతో కొనుగోలుదారులు పోటీపడ్డారు.అపార్ట్‌మెంట్లలో ప్లాట్లు, ఖరీదైన భూములు చేతులు మారాయి. సందెట్లో సడేమియా అన్న చందంగా జేబుదొంగలు రిజిస్ట్రేషన్‌ కార్యాలయం వద్దే మకాం వేశారు. పెద్ద ఎత్తున డబ్బులు తెచ్చారనే సమాచారంతో జేబుదొంగలు కార్యాలయం వేద్ద తచ్చాడారు. శనివారం భూమి కొనుగోలు చేసిన ఓ వ్యక్తికి చెందిన రూ.35 వేలు తస్కరించారు.