రిమ్స్ ఉద్యోగుల సమ్మెతో రోగుల అవస్థలు
ఆదిలాబాద్, ఫిబ్రవరి 1 (): 23 రోజులుగా రిమ్స్ ఉద్యోగులు, సిబ్బంది సమ్మె చేస్తుండడంతో రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాంట్రాక్టు సిబ్బంది, ఉద్యోగులు పెండింగ్ వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగడంతో రోగుల పరిస్థితి అయోమయంగా మారింది. అవసరమైన పరికరాలు ఉన్నప్పటికీ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో రోగులకు సరైన సౌకర్యాలు అందడం లేదు. సిబ్బంది చేయాల్సిన పనులను నర్సులు చేయడంతో రోగులకు అదనపు చికిత్సలు అందడం లేదు. కాగా జిల్లా కేంద్రంలో ఉద్యోగులు వేతనాల కోసం సమ్మె చేస్తే పట్టించుకునే అధికారి లేడని ఉద్యోగులు, సిబ్బంది వాపోతున్నారు. వేతనాలు లేక కుటుంబాలు పస్థులు ఉండాల్సి వస్తుందని గత్యంతరం లేక అధికారులు పట్టించుకోనందున సమ్మెకు దిగాల్సి వచ్చిందని వారు అంటున్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు కల్పించుకొని తమ సమస్యలను పరిష్కరించి రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కాంట్రాక్టు ఉద్యోగులు, సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు.