రియో ఒలంపిక్స్‌కు తరవాతయినా మారుతామా?
క్రీడలపట్ల మనప్రభుత్వాలకు ఎప్పుడూ చిన్నచూపే. క్రీడలను అధికారికంగా ప్రోత్సహిస్తున్న దాఖలాలు అంతంతమాత్రమే. అయినా దేశంలో అనేకమంది తమకున్న ఇష్టం లేదా పట్టుదలతో క్రీడాకారులుగా ఎదుగుతూ జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో మెరుపులు సాధిస్తున్నారు. ఈ దశలో రియో ఒలంపిక్స్ మరోమారు మనకు పరీక్ష కాబోతున్నాయి. ఎంతమంది ఎన్ని పతకాలు సాధిస్తారో కానీ మనకు ఓ కొత్త ఉత్సాహాన్ని నింపుతాయనడంలో సందేహం లేదు. క్రీడలంటే క్రికెట్, క్రికెట్ అంటే క్రీడలు అనే విధంగా మన క్రీడా వ్యవస్థ తయారైంది. క్రికెట్‌ను ప్రోత్సహించినట్లుగానే మిగతా క్రీడలను కూడా ప్రోత్సహించే సంస్కృతి రావాలి. క్రికెట్‌కు ఇస్తున్న ప్రచారం కూడా మిగతా క్రీడలకురావాలి. ఇందుకోసం నిధులు పెంచాలి. క్రీడలకు ప్రత్యేకంగా శిక్షణ కేంద్రాలు ప్రభుత్వం పక్షాన చేపట్టాలి. అప్పుడే మన క్రీడారంగం ముందుకు సాగగలదు. ఔత్సాహిక క్రీడాకారులకు ప్రోత్సాహం దక్కగలదు. మోడీ హయాంలో అయినా ఇందుకు సాధన చేయాల్సి ఉంది. రెండు వందలకు పైగా దేశాల నుంచి పదివేలకు పైగా క్రీడాకారులు పాల్గొంటున్న రియో ఒలింపిక్స్ మహా సంరంభానికి మరో కొన్నిరోజుల్లో తెర లేవనుంది. రియోకు వెళ్లేముందు క్రీడాకారులను భారత ప్రధాని మోడీ అభినందించారు. వారిని వెన్నుతట్టి ప్రోత్సహించారు. మంచి ఫలితాలతో రావాలని ఆకాంక్షించారు. జనాభా పరంగా ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద దేశమైన భారత్ 1920 ఒలింపిక్స్ నుంచి వరుసగా క్రమం తప్పకుండా ప్రతి ఒలింపిక్స్‌లోనూ పాల్గొంటూ వస్తున్నా పేలవమైన సామర్థ్యంతో పతకాల వేటలో అట్టడుగున వుంటున్నది. రియో ఒలింపిక్స్‌కు ఈసారి మన దేశం నుండి వందకు పైగా క్రీడాకారులతో కూడిన భారీ బృందం వెళ్తోంది. 2012 లండన్ ఒలింపిక్స్‌కు 83 మందితో కూడిన జట్టును పంపగా ఈసారి మరో పాతిక మందిని అదనంగా జోడించారు. భారత ఒలింపిక్స్ చరిత్రలో బహుశా ఇదే భారీ బృందం కావచ్చు. రాశి కన్నా వాసి ముఖ్యం. వాస్తవానికి మన దేశ జనాభాతో పోల్చినప్పుడు దేశం తరపున పాల్గొంటున్న క్రీడాకారుల సంఖ్య చాలా తక్కువ.
అయితే రియోలో ఎంతమంది పాల్గొంటున్నారనే దానికన్నా ఎన్ని పతకాలు సాదించబోతున్నారన్నదే నూట ఇరవై కోట్ల భారతీయులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. ఇలాంటి క్రీడాకారులకు దేశం తరఫున అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం, ఒలంపిక్స్‌కు ముందే తర్ఫీదు ఇవ్వడం వంటివి చేయడం లేదు. ఒలింపిక్స్‌లో పాల్గొనడమే గొప్పగా భావించే పరిస్థితి ఒకప్పటి మాట. ఇప్పుడు ఒలింపిక్స్‌లో పాల్గొనడం కన్నా పతకాల సాధనకే ఎక్కువ ప్రాముఖ్య మేర్పడింది. ఈ పతకాల వేటలో క్యూబా, జమైకా వంటి చిన్న దేశాలు సైతం అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శించి పతకాల పట్టికలో పైపైకి ఎగబాకుతున్నాయి. చివరికి ఆకలితో కటకటలాడే ఇథియోపియా సైతం అథ్లెటిక్స్ వంటి వ్యక్తిగత ఈవెంట్లలో స్వర్ణపతకాలను ఎగరేసుకపోతోంది. ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు సదుపాయాల కల్పనలో మెరుగుదల వున్నా భారత క్రీడా వ్యవస్థ పరిస్థితిలో మాత్రం చెప్పుకోదగ్గ మార్పు ఏవిూ లేదనేచెప్పాలి.మన జాతీయ క్రీడ హాకీ మొదలు ఫుట్‌బాల్ దాకా ఏ రంగంలో చూసినా ఏమున్నది గర్వకారణం అని నిట్టూర్చాల్సి వస్తుంది. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత ఈవెంట్లలో భారత్ సాధించిన ఏకైక స్వర్ణం షూటింగ్లో లభించింది. బీజింగ్ ఒలింపిక్స్‌లో అభినవ్ బింద్రా సాధించిన ఈ పసిడి పతకం చూసి భారత్ మురిసిపోయింది. గ్రావిూణ ప్రాంతాల్లో సరైన క్రీడా సదుపాయాలు లేక సాధన కోసం పట్టణ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.ఈ పరిస్థితి మారకుండా క్రీడా ప్రమాణాలు మెరుగుపడవు. క్రీడా ప్రమాణాలు మెరుగుపడకుండా మన అథ్లెట్లు అంతర్జాతీయ స్థాయిలో రాణించలేరు. దీనిని మార్చేందుకు చొరవ చూపకుండా రియోకు వందమందిని కాదు వెయ్యి మందిని పంపినా
ప్రయోజనం వుండదు. పాలకుల లోపాలు, వైఫల్యాలు ఎన్ని వున్నప్పటికీ రియోలో భారత క్రీడాకారులు పట్టుదలే ఊపిరిగా పోరాడి దేశానికి ఓ అరడజను పతకాలైనా సాధించి పెట్టాలన్న ఆకాంక్షతో వెళుతున్నారు. చైనా లాంటి దేశాల్లో క్రీడలకు ఇస్తున్న ఊప్రాముఖ్యం మనం ఇవ్వడం లేదు. చిన్న దేవౄలను చూసి మన పాలకులు నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. హాకీలో ఎనిమిది స్వర్ణాలతో సహా పదకొండు పతకాలు సాధించిన భారత్ నేడు ఆ ఒలింపిక్ క్రీడలో అడుగుపెట్టే అర్హత సాధించడానికే ఆపసోపాలు పడే పరిస్థితి. 1950, 60ల వరకు హాకీలో ప్రపంచ నెంబర్ వన్‌గా నిలిచిన భారత్‌ను వెనక్కి నెట్టి నెదర్లాండ్స్, స్పెయిన్, జర్మనీ ఆ స్థానాన్ని ఆక్రమించాయి. హాకీలో పూర్వ వైభవాన్ని సంతరించుకోవడానికి భారత ఒలింపిక్ అసోసియేషన్ కానీ, క్రీడా మంత్రిత్వ శాఖ కానీ ఎలాంటి నిర్దిష్ట చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. హాకీ ఒక్కటే కాదు విలువిద్య, అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్ వంటి ఈవెంట్ల అన్నిటా క్రీడా ప్రమాణాల మెరుగుదలకు చేసిందేవిూ లేదు. ఆకలి, పేదరికం తాండవించే ఇథియోపియా వంటి దేశాలు క్రీడల్లో సత్తా చాటుకుంటుంటే వనరులన్నీ వుండి మనం ఎందుకు వెనకబడుతున్నాం? ఇది మన క్రీడా విధానంలోని లోపమే తప్ప క్రీడాకారుల లోపం కాదు. ఒలింపిక్స్ పతకాల పట్టికలో అగ్రస్థానం కోసం అమెరికా, చైనాలు నువ్వా నేనా అన్న రీతిలో గత నాలుగు పర్యాయాలుగా తలపడుతూ వస్తున్నాయి. రియోలో అమెరికా ఆధిపత్యానికి చైనా గండి కొట్టి తానే నెంబర్‌వన్‌గా నిలవాలని తహతహలాడుతున్నది. ఇకనైనా మనం క్రీడలకు ప్రోత్సాహకాలు పెంచి వారిని తీర్చిదిద్దకుంటే మరింతగా వెనకబడి పోతామని గుర్తుంచుకోవాలి.