రిసార్ట్ హోటళ్లో భారీ అగ్నిప్రమాదం
18మంది సజీవ దహనం
బీజింగ్,ఆగస్ట్25(జనం సాక్షి): చైనాలోని హార్బిన్ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ రిసార్ట్ హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగి 18 మంది సజీవదహనమయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. హార్బిన్‌లోని సన్ ఐలాండ్ రిసార్ట్ ప్రాంతంలో గల బెయ్‌లాంగ్ హాట్ స్పింగ్ ¬టల్‌లో శనివారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. మొదట నాలుగో అంతస్తులో ప్రారంభమైన మంటలు కాసేపటికే భవనమంతా వ్యాపించాయి. సమాచారమందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. 30 అగ్నిమాపక శకటాలతో 105 మంది సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే మంటల్లో చిక్కుకుని 18 మంది మృతిచెందారు. మరో 16 మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడి స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.