రుణమాఫీ అంతా బూటకం

ఆదిలాబాద్‌,నవంబర్‌8(జ‌నంసాక్షి): తెరాస ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌ అన్నారు. మిషన్‌ భగీరథ, కాకతీయ, బట్టల పంపిణీ అంటూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. రైతులు పండించిన పంటలకు మార్కెట్‌లో సరైనా గిట్టుబాటు ధర లేకపోవడంతోనే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం, బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అమలు చేసిన రుణ మాఫీ అంతా బూటకమన్నారు. వాస్తవంగా క్షేత్రస్థాయిలో దీని అమలు తీరును చూస్తే రైతుల పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. రుణమాఫీని నాలుగు విడతల్లో విడుదల చేసి వడ్డీ కిందకు జమ చేసుకుంటున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు భాజపాను ఆదరించాలన్నారు.