రుణమాఫీ ఆత్మహత్యలను నివారించలేవు

4

– కార్యచరణ దిశగా కదలండి

– హైకోర్టు

హైదరాబాద్‌,డిసెంబర్‌21(జనంసాక్షి): తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రైతు ఆత్మహత్యలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం చేసింది.ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్టాల్ల్రో ఆత్మహత్యల నివారణపై కార్యాచరణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. కేవలం రుణమాఫీ ఇతర పరిహారాలతో సమస్య తీరదని అభిప్రాయపడింది. ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక కార్యాచరణతో రావాలని ఇరు రాష్ట్రాలను ఆదేశించింది. సోమవారం హైకోర్టులో దీనిపై విచారణ జరిగింది. రైతుల సమస్యలపై నిపుణులతో సమావేశం ఏర్పాటు చేయాలని  ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆత్మహత్యలకు మూల కారణాలపై చర్చించాలని సూచించింది. కేవలం రుణమాఫీతోనే ఆత్మహత్యల నివారణ సాధ్యం కాదని వ్యాఖ్యానించింది. అన్ని అంశాలపై చర్చించి పరిష్కార మార్గాలతో రావాలని ఆదేశించింది. హైకోర్టు నేతృత్వంలో నిపుణుల కమిటీ వేయాలని కోదండరాం తరపు న్యాయవాది హైకోర్టును కోరారు.

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. బ్యాంకు రుణాలు రాక..పంటలు ఎండిపోతుండడం..మద్దతు ధర రాకపోతుండడం..ఇతరత్రా కారణాలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనిపై కోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతు ఆత్మహత్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టులో ఎలాంటి విచారణ జరిగింది తదితర అంశాలను న్యాయవాదులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయలేదని, రైతుల ఆత్మహత్యలు ఆపడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారని కోర్టు ప్రశ్నించినట్లు తెలిపారు. నిపుణులు..ఇతరులతో కమిటీ ఏర్పాటు చేసి వారి సూచనలను పరిగణలోకి తీసుకుని ఒక నివేదిక తయారు చేయాలని సూచించిందని పేర్కొన్నారు.