రూ. 58కోట్లు ఏమయ్యాయి..?

– ఓపికపట్టు చిట్టినాయుడు.. విచారణ జరుగుతుంది

– ట్విటర్‌లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

అమరావతి, డిసెంబర్‌2(జ‌నంసాక్షి) : టీడీపీ, అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌లపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌వార్‌ కొనసాగుతోంది. మరోసారి టీడీపీ టార్గెట్‌గా విజయసాయి విరుచుకుపడ్డారు. మహిళల భద్రత పేరుతో గత టీడీపీ ప్రభుత్వం అవినీతి చేసిందని ఆరోపించారు. పెద్ద స్కామ్‌ జరిగిందంటూ నారా లోకేష్‌ టార్గెట్‌గా ట్విట్టర్‌లో విమర్శలు చేశారు. అలాగే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వైసీపీ సర్కార్‌పై చేసిన విమర్శలకు కౌంటర్‌ ఇచ్చారు. ఐటీ మంత్రిగా ఉండగా మహిళల భద్రత కోసం కేంద్రం ఇచ్చిన రూ.58కోట్లను చిట్టి నాయుడు సింగపూరుకు మళ్ళించేశాడని అన్నారు. ఆటోల్లో ప్రయాణించే మహిళల భద్రత కోసం యాప్‌ తయారీకి ఖర్చు చేసినట్లు మస్కా కొట్టాడని, ఇప్పుడు మహిళల భద్రతపై బెంగ నటిస్తున్నాడని విజయసాయి విమర్శింరాఉ. రూ.58 కోట్ల స్కామ్‌పై విచారణ జరుగుతోందని, ఓపికపట్టు చిట్టీ! త్వరలో నిజాలు బయటకొస్తాయి అంటూ ట్వీట్‌ చేశారు. వ్యవసాయం అంటే ఏమిటో తెలియని నటుడు రైతుల గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. విూ యజమాని (చంద్రబాబు) రాజధాని పేరుతో 35వేల ఎకరాల సారవంతమైన భూమిని లాక్కుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు అప్పగించారఅంటూ ఘాటు విమర్శలు చేశారు. గతంలో వ్యవసాయం దండగ అని కూడా అన్నారని.. వాటిపై స్పందిస్తే బాగుంటుందని విజయసాయి ట్వీట్‌లో పేర్కొన్నారు.