రెండోరోజుకు చేరిన సీఎం రమేశ్‌ దీక్ష

కడప, జూన్‌21(జ‌నం సాక్షి) : కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధన కోసం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష రెండో రోజూ గురువారం కొనసాగింది. మొదటి రోజు భారీ సంఖ్యలో ప్రజలు, వివిధ వర్గాలు, రాజకీయ పార్టీలు వీరి దీక్షకు సంఘీభావం ప్రకటించారు. గురువారం కూడా వివిధ విద్యార్థి సంఘాలు, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, తెలంగాణ నుంచి వచ్చిన కొందరు ప్రజాసంఘాల నాయకులు సీఎం రమేశ్‌కు మద్దతు తెలిపారు. ఉక్కు దీక్షలు 350 రోజులకు చేరుకున్న సందర్భంగా ఆర్సీపీ కార్యకర్తలు సీఎం రమేశ్‌ చేపట్టిన దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. శుక్రవారం నుంచి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు దీక్షాస్థలికి చేరుకుని మద్దతు తెలుపుతారని తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. అధికార పార్టీ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు తమ పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్‌ రెడ్డి తెలిపారు. పలువురు జాతీయ నాయకులు సీఎం రమేశ్‌కు ఫోన్లు చేసి సంఘీభావం ప్రకటించారు.