రెండో పెళ్లి చేసుకుంటున్నాడంటూ ఎస్సైపై భార్య ఫిర్యాదు
ఎమ్మిగనూరు టౌన్, ఫిబ్రవరి 7: తన భర్త, ఎస్సై గణేశ్‌రావు రెండో పెళ్లి చేసుకుంటున్నాడంటూ అతని భార్య సవితాబాయి శనివారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేసింది. కర్నూలు జిల్లా నందవరం మండలం నాగలదిన్నెకు చెందిన గణేశ్‌రావు కోసిగిలో కానిస్టేబుల్‌గా పనిచేసిన సమయంలో సమీప బంధువు సవితాబాయిని వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత ఎస్ఐగా ఎంపికై చిత్తూరు జిల్లా అలిపిరిలో పనిచేస్తున్నాడు. అదనపు కట్నం వస్తుందన్న ఆశతో ఎమ్మిగనూరుకు చెందిన యువతిని రెండో వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న భార్య సవితాబాయి కోర్టును ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరింది. ఇందుకు సమ్మతించిన జూనియర్ సివిల్ జడ్జి రవిశంకర్ రెండో వివాహానికి సిద్ధమైన ఎస్సై గణేశ్రావును, శశికళను కోర్టు ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించారు. గణే్షరావుపై 420 కేసు నమోదు చేయాలని ఆదేశించారు.