రెడీ అవుతున్న బతుకమ్మ చీరలు 

సిరిసిల్ల కార్మికులకు చేతినిండా పని
రాజన్న సిరిసిల్ల,ఆగస్ట్‌28 (జనంసాక్షి):   బతుకమ్మ చీరలు సిరిసిల్ల కేంద్రంగా రూపుదిద్దుకుంటున్నాయి. సిరిసిల్ల నేతకార్మికుల కనుసన్నల్లో ఇవి ముస్తాబవుతున్నాయి. చెక్స్‌.. లైనింగ్‌ తదితర పది విభిన్న డిజైన్లతో బతుకమ్మ చీరెలు కొత్త మెరుగులను అద్దుకుంటున్నాయి. ఎమ్మెల్యే కేటీఆర్‌ చొరవతో రూ. 320 కోట్ల విలువైన కోటి చీరెల ఆర్డర్‌ సిరిసిల్లకు దక్కగా, ఉత్పత్తి ముమ్మరంగా సాగుతున్నది. మొత్తంగా 6 కోట్ల విూటర్ల ఉత్పత్తి లక్ష్యంలో 4కోట్ల విూటర్లు సిద్ధం చేశారు. చీరెల తయారీకి నాణ్యమైన ముడిసరుకును ఉపయోగిస్తున్నారు. సూరత్‌ నుంచి 600 టన్నుల జరీ, గుజరాత్‌లోని చిల్వాస నుంచి నూలు  తెప్పించి వాడుతున్నారు. ఆరు గజాలతోపాటు ప్రత్యేకంగా ఎనిమిది గజాల చీరెలను నేయిస్తున్నారు. బతుకమ్మ పండుగ సవిూపిస్తున్న నేపథ్యంలో చీరెల తయారీ తుది దశకు చేరుకున్నది. వీటి తయారీకి మొత్తం 20వేల మంది కార్మికులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. సెలవు రోజుల్లోనూ కార్మికులు పనిచేస్తూ లక్ష్యాన్ని పూర్తిచేయాలన్న సంకల్పంతో ముందుకుపోతున్నారు. సెప్టెంబర్‌ మూడో వారం నుంచే అన్ని జిల్లాల్లో చీరెలను లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. మొత్తం కోటి చీరెల్లో ఇప్పటికే పూర్తిస్థాయిలో సిద్ధమైన 56 లక్షలకుపైగా చీరెలను సిద్ధం చేసి టెస్కో సంస్థకు అప్పగించారు. అక్కడి నుంచి వాటిని జిల్లాలకు తరలింపు మొదలైంది. తెల్లరేషన్‌ కార్డు లబ్దిదారుల్లో మహిళలతోపాటు ఆ కుటుంబంలో 18 ఏండ్లు నిండిన ప్రతి యువతికి పంపిణీ చేయనున్నారు. బతుకమ్మ చీరెలపై ఆడబిడ్డల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.