రేపు రామేశ్వరంలో కలాం అంత్యక్రియలు
– కుటుంబ సభ్యుల కోరిక మేరకు భౌతిక ఖాయం తరలింపు
– ఏర్పాట్లను పర్యావేక్షిస్తున్న అధికారులు
న్యూఢిల్లీ/చెన్నై, జులై 28(జనంసాక్షి):
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అంత్యక్రియలు గురువారం ఉదయం 10.30 గంటలకు ఆయనస్వగ్రామం తమిళనాడులోని రామేశ్వరంలో నిర్వహించనున్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన పార్థివదేహాన్ని ఢిల్లీ నుంచి ఆయన స్వస్థలమైన తమిళనాడులోని రామేశ్వరానికి తరలించనున్నారు. అక్కడ ప్రజల సందర్శనార్థం సాయంత్రం 7 గంటల వరకు ఉంచనున్నారు. అనంతరం గురువారం ఉదయం 10.30 గంటలకు కలాం పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. కుఉటంబ సభ్యుల కోరిక మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అబ్దుల్ కలా అంత్యక్రియలు తమిళనాడులోని రామేశ్వరంలో బుధవారం నిర్వహించాలని ముందు అనుకున్నా తదుపరి గురువారానికి మార్చారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. షిల్లాంగ్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో సోమవారం సాయంత్రం 6.30 గంటలకు ఉపన్యాసమిస్తూ కలాం ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అనంతరం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆయన అస్తమయం చెందారని 7.45 గంటలకు ధృవీకరించారు. అంత్యక్రియలు రామేశ్వరంలోనే నిర్వహించాలని కలాం కుటుంసభ్యులు కేంద్రాన్ని కోరారు. దీంతో కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి రామేశ్వరంలోనే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. కలాంకు పిల్లలంటే ఎంతో ఇష్టం. అందువల్ల ప్రజల సందర్శనార్ధం బుధవారం రాత్రి 7గంటల వరకు రామేశ్వరంలోని కలాం చదవుకున్న పాఠశాలలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచుతారు. అనంతరం ముస్లిం మతాచారాల ప్రకారం ఆయన పార్థివదేహాన్నిమొహిద్‌బిన్ మసీదులో ఖననం చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే అంత్యక్రియలు జరిగే ప్రాంతాన్ని కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. ఇదిలావుంటే రామేశ్వరంలో కలాం అంత్యక్రియలకు తమిళనాడు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మంగళవారం రామనాథపురం జిల్లా కలెక్టర్, ఎస్పీ అంత్యక్రియలు నిర్వహించే స్థలాన్ని పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కలాం అంత్యక్రియలకు ప్రముఖులు హాజరు కానుండటంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు కలాం కుటుంబ సభ్యులను రామేశ్వరంలో కలెక్టర్ తదితరులు పరామర్శించారు. కలాం మరణించారన్న వార్త తెలిసి పలువురు వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. స్థానికులు వందల సంఖ్యలో అబ్దుల్ కలాం ఇంటి ముందు గుమిగూడారు. కలాం అన్నయ్య మొహమ్మద్ ముత్తువిూరా లెబ్బాయ్ మరైకర్ (99) రామేశ్వరంలోనే నివసిస్తున్నారు. తమ్ముడి మరణ వార్త విని ఆయన కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆయన్ను ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. ఇంట్లో కలాం కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక కలాంతో అనుబంధమున్న ఎంతో మంది రామేశ్వరం వాసులు కలాం మరణ వార్త విని చలించిపోయారు. కలాం మృతికి సంతాప సూచికగా స్థానికంగా ఉన్న మసీదును మూసేశారు. స్థానికులు కలాం పార్థీవ దేహాన్ని రామేశ్వరం రప్పించి ఆయనకు ఇక్కడే అంతిమ సంస్కారాలు నిర్వహించాలని కోరారు. అబ్దుల్ కలాం బాల్యమంతా రామేశ్వరం దీవిలోనే గడిచింది.
ఇదిలావుంటే మంగళవారం ఉదయం షిల్లాంగ్ నుండి ప్రత్యేక విమానంలో కలాం పార్థివ దేహాన్ని గువాహటికి రక్షణ శాఖ తరలించింది. అక్కడి నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకుని వచ్చారు. పాలెం విమానాశ్రయంలో ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. ప్రజల సందర్శనార్థం ప్రభుత్వ అధికారిక నివాసం టెన్ రాజాజీ మార్గ్ లో కలాం పార్థీవ దేహాన్ని తరలించారు.