*రేపు సీఎం నిజామాబాద్ పర్యటన*
*నూతన సమీకృత కలెక్టరేట్,బహిరంగ సభ ప్రాంగణంలో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి*
*సీఎం సభకు జిల్లా నలుమూలల నుంచి భారీగా జనం రానున్నారు*
– మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్ బ్యూరో,సెప్టెంబర్4(జనంసాక్షి):
ముఖ్యమంత్రి కేసిఆర్ నిజామాబాద్ పర్యటనకు సర్వం సిద్ధం అయ్యింది. ఆదివారం నాడు అందుకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించారు. సోమవారం నాడు ముఖ్యమంత్రి కేసిఆర్ ముందుగా జిల్లా కేంద్రంలో నిర్మించిన టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభిస్తారని,అనంతరం నూతనంగా నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. అనంతరం గిరిరాజ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని, జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని అన్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని చెప్పారు. కేసిఆర్ సభకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు స్వచ్చందంగా తరిలి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారని అన్నారు. వెహికిల్ పెట్టండి మేము సభకు వస్తాం అని జిల్లా ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని అన్నారు. రేపు జరగబోయే బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రసంగం కోసం యావత్ జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. టిఆర్ఎస్ శ్రేణులు , అభిమానులు సభ విజయవంతానికి కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
మంత్రి తో పాటు ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్,అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా,ఎమ్మెల్సి విజి గౌడ్, టిఎస్ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు, మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి,జడ్పీ చైర్మన్ విఠల్ రావు, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, నగర సి.పి నాగరాజు, పలువరు అధికారులు, తదితరులు ఉన్నారు.