రేవంత్‌కు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ మంజూరు

xbv61b5l

ఓటుకు నోటు కేసులో ప్ర‌థ‌మ ముద్దాయి అయిన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి బెయిల్‌కు సంబంధించి హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. ఐదు ల‌క్ష‌ల‌తోపాటు ఇద్ద‌రు వ్య‌క్తుల‌ పూచీక‌త్తును స‌మ‌ర్పించాల‌ని ఆయ‌న‌కు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో రేవంత్‌కు బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాల‌ను తారుమారు చేస్తార‌న్న‌ తెలంగాణ అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ వాద‌న‌ల‌తో హైకోర్టు ఏకీభ‌వించ‌లేదు. రేవంత్‌ను ఇంకా విచారించాల్సి ఉంద‌ని, కొన్ని కీల‌క ఆధారాలు ల‌భ్య‌మైనందున వాటి ఆధారంగా మ‌రికొన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఆయ‌న నుంచి రాబ‌ట్టాల్సి ఉంద‌ని ప్రాసిక్యూష‌న్ వాదించింది. అయితే రేవంత్‌ను రాజ‌కీయ క‌క్ష‌సాధింపులో భాగంగానే ఈ కేసులో ఇరికించార‌న్న రేవంత్ న్యాయ‌వాది వాద‌న‌తో కోర్టు ఏకీభ‌వించింది. ఈ కేసులో అరెస్ట్ అయిన మ‌రో ఇద్ద‌రు స‌హ‌ నిందితులు సెబాస్టియ‌న్‌, ఉద‌య్‌సింహ‌ల‌కు కూడా బెయిల్ ల‌భించింది. ఈ ఇద్ద‌రూ కూడా ఐదు ల‌క్ష‌లతోపాటు ఇద్ద‌రు వ్య‌క్తుల పూచీక‌త్తు ఇవ్వాల్సి ఉంటుంది. రేవంత్‌ సొంత నియోజ‌క‌వ‌ర్గం మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా కొడంగ‌ల్‌, హైద‌రాబాద్‌లు దాటి పోరాద‌ని హైకోర్టు ఆదేశించింది. ముగ్గురు నిందితులు కూడా పాస్ పోర్టును కూడా కోర్టుకు స‌రెండ‌ర్ చేయాల‌ని న్యాయ‌మూర్తి ఆదేశించారు. అవినీతి నిరోధ‌క‌శాఖ అధికారుల‌కు అందుబాటులో ఉండాల‌ని, విచార‌ణ‌కు ఎప్పుడు పిలిచినా వెళ్ళి స‌హ‌క‌రించాల‌ని ఆదేశించింది. రేవంత్‌కు బెయిల్ ల‌భించ‌డంతో ప్ర‌స్తుతం చ‌ర్ల‌ప‌ల్లి జైలులో ఉన్నఆయ‌న రేపు విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ హైకోర్టు నుంచి పేప‌ర్లు స‌కాలంలో అందితే ఈరోజు సాయంత్రం ఐదు గంట‌ల‌లోపు విడుద‌ల కావ‌చ్చు. లేక‌పోతే విడుద‌ల రేపే అవుతుంది.
ఓటుకు నోటు కేసులో రేవంత్‌ను జూన్ ఒక‌టో తేదీన అరెస్ట్ చేశారు. ముందుగా ఆయ‌న్ను 14 రోజుల రిమాండుకు పంపారు. ఈ రిమాండు చెంచ‌ల‌గూడ జైలులో ఏర్పాటు చేయ‌గా అక్క‌డ రేవంత్‌ను ఉంచ‌డానికి స‌రైన సౌక‌ర్యాలు లేవ‌ని జైలు అధికారులు కోర్టులో మెమో దాఖ‌లు చేయ‌డంతో మ‌ళ్ళీ ఆయ‌న్ని చ‌ర్ల‌ప‌ల్లి జైలుకు త‌ర‌లించారు. అనంత‌రం ఆయ‌న్ని ప్ర‌శ్నించేందుకు వీలుగా త‌మ క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని ఏసీబీ కోర్టులో మెమో దాఖ‌లు చేయ‌డంతో న్యాయ‌మూర్తి మంజూరు చేశారు. ఈ నాలుగు రోజుల్లో రేవంత్‌ను ఈ కేసుకు సంబంధించి అనేక కీల‌క ప్ర‌శ్న‌లు వేసి స‌మాచారం రాబట్టింది ఏసీబీ. ఆ త‌ర్వాత మ‌ళ్ళీ చ‌ర్ల‌పల్లి జైలుకు పంపించారు. ఈ 14 రోజులు గ‌డువు ముగియ‌డంతో మ‌రోసారి ఆయ‌న రిమాండు పొడిగింపు… ఇలా రెండుసార్లు రేవంత్ రిమాండు పొడిగించాల్సి వ‌చ్చింది. వాస్త‌వానికి ఆయ‌న‌కు జులై 13 వ‌ర‌కు జ్యుడీషియ‌ల్ రిమాండు ఉంది. ఈ రోజు హైకోర్టు బెయిల్ మంజూరు చేయ‌డంతో ఆయ‌న జ్యుడీషియ‌ల్ రిమాండు నుంచి బ‌య‌ట‌ప‌డి బాహ్య ప్ర‌పంచంలోకి రానున్నారు. అయితే ఆయ‌న‌కు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ మంజూరు చేయ‌డంతో ఎక్క‌డ‌బ‌డితే అక్క‌డ తిరిగే స్వేచ్ఛ లేన‌ట్టే!