రేవంత్ నివాసంలో.. ముగిసిన సోదాలు
– శనివారం వేకువజాము వరకు సోదాలు
– 43గంటల పాటు రేవంత్ ఇంట్లో సోదాలు చేసిన ఐటీశాఖ అధికారులు
– 31గంటల పాటు రేవంత్‌పై ప్రశ్నల వర్షం
– రేవంత్ నుంచి 150 ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు రాబట్టిన అధికారులు
– రూ. 20కోట్లు లెక్కచూపని ఆస్తులు గుర్తింపు?
– అక్టోబర్ 3న ఐటీ కార్యాలయంకు రావాలని రేవంత్ కి నోటీసులు జారీ
హైదరాబాద్, సెప్టెంబర్29(జనంసాక్షి) : ఆదాయానికి మించి ఆస్తులు కూడాబెట్టారన్న ఫిర్యాదులతో తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసంలో ఆదాయపు పన్ను శాఖ చేపట్టిన సోదాలు ముగిశాయి. గురువారం రాత్రి నుంచి శనివారం వేకువజామున 2.30 గంటల వరకు ఈ సోదాలు జరిపిన ఐటీ అధికారులు.. కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకుని తిరిగి వెళ్లారు. కాగా అక్టోబర్ మూడో తేదీన ఐటీ శాఖ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలని రేవంత్‌రెడ్డికి సూచించారు. ఇదిలా ఉంటే దాదాపు 43 గంటల పాటు రేవంత్ రెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువుల ఇండ్లలోనూ సోదాలు నిర్వహించారు. దీంట్లో 31గంటల పాటు రేవంత్ ను ఐటీశాఖ అధికారులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా 150 ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు రాయించుకున్నారు. మొదటిరోజు రేవంత్ సోదరులు కృష్ణారెడ్డి, కొండల్‌రెడ్డి, బావమరిది జయప్రకాశ్‌రెడ్డిలతోపాటు ఆయన మిత్రులు సెబాస్టియన్, ఉదయసింహ ఇళ్లలో కూడా అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రేవంత్ బంధువుల స్థిరాస్తి వ్యాపార లావాదేవీలకు సంబంధించిన ఆదాయ వ్యయ వివరాలు సేకరించేందుకే అధికారులు తొలిరోజు ప్రాధాన్యమిచ్చారు. శుక్రవారం మాత్రం కేవలం రేవంత్‌రెడ్డి ఇంట్లోనే సోదాలు చేశారు. ఎన్నికల సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్లు, ఆదాయపు పన్ను శాఖకు దాఖలు చేసిన అఫిడవిట్లు దగ్గర పెట్టుకుని మరీ సోదాలు చేశారు. ఈ సందర్భంగా లెక్క చూపని ఆస్తులు రూ.20 కోట్లు ఉన్నట్లు గుర్తించారు. ఇది రేవంత్ బావమరిది జయప్రకాశ్‌రెడ్డికి చెందిన శ్రీ సాయిమౌర్య ఎస్టేట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన మొత్తంగా తేలింది. ఈ కంపెనీ 2011 తర్వాత ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం లేదు. ఈ కంపెనీ ఆదాయ, వ్యయాలను పరిశీలించగా లెక్క చూపించని ఆదాయం రూ.20 కోట్లు తేలింది. దీనికి సంబంధించిన 30శాతం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు రేవంత్ భార్య గీత బ్యాంక్ లాకర్‌ను తెరిపించిన అధికారులు 560 గ్రాముల బంగారాన్ని, కొన్ని ఆస్తిపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయన మామ పద్మారెడ్డి ఇంట్లోనూ 10లక్షల నగదు లభ్యమైంది. రేవంత్ నివాసంలో నిన్న కొన్ని వజ్రాభరణాలు, బంగారు ఆభరణాలు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆభరణాల విలువ అంచనా వేసేందుకు నిపుణులను తీసుకొచ్చారు. సోదాల సందర్భంగా అధికారులు రేవంత్‌రెడ్డి ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫోన్లతోపాటు గురువారం స్వాధీనం చేసుకున్న కంప్యూటర్ హార్డ్‌డిస్కులను సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీకి చెందిన నిపుణులను పిలిచి అప్పగించారు. న్యాయస్థానం అనుమతితో వీటిని విశ్లేషించి అందులో ఉన్న సమాచారం వెలికితీసి నివేదిక సమర్పించనున్నారు. ఫోరెన్సిక్ అధికారుల పరిశీలనలో కొంత కీలక సమాచారం లభ్యమయ్యే అవకాశముందని చెప్తున్నారు. రేవంత్ ఇంట్లో బంగారు, వజ్రాభరణాలు, ఖరీదైన వస్తువులు భారీగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. వాటి విలువను సైతం లెక్కగట్టినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే..
రేవంత్ రెడ్డి ఖాతాల్లోకి విదేశాల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది..? ఎక్కడికి మళ్లించారు..? అనే కోణాల్లో ఐటీ అధికారులు విచారణ కొనసాగింది. ఫెమా, మనీలాండరింగ్ చట్టాలను ఉల్లంఘించిన తీరు తో పాటు? రేవంత్ రెడ్డి విదేశీ బ్యాంకు ఖాతాల వివరాలను తెలుసుకుని వాటిపై అదనపు సమాచారాన్ని రేవంత్‌రెడ్డి నుంచి తెలుసుకున్నట్టు సమచారం. మరోవైపు.. ఓటుకు నోటుకేసులో ముద్దాయిలుగా ఉన్న సెబాస్టియన్, ఉదయసింహ ఇండ్లలోనూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగాయి. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఇచ్చిన రూ.50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయని వీరిని అధికారులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. సోమవారం ఉదయసింహను, అక్టోబర్ 1న సెబాస్టియన్‌ను తమఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించినట్టు సమాచారం. ఉదయసింహను రేవంత్‌రెడ్డి ఇంటికి పిలిపించి, కొన్ని విషయాల్లో వారిద్దరినీ కలిపి ప్రశ్నించారని తెలిసింది. అయితే.. రేవంత్ నుంచి 150 ప్రశ్నలకి లిఖిత పూర్వకంగా జవాబులు రాయించుకున్న ఐటీ శాఖ.. అక్టోబర్ 3న ఐటీ ఆఫీస్ కి హాజరు అవ్వాలని రేవంత్ కి నోటీసులు జారీ చేసింది.