రేవంత్‌ నివాసంలో రెండోరోజూ కొనసాగిన సోదాలు

ఐటి లెక్కల్లో తేడాలున్నాయని గుర్తించిన అధికారులు
బ్యాంక్‌ ఖాతాల లావాదేవీలపై సతీమణి గీతను ప్రశ్నించిన అధికారులు
హైదరాబాద్‌,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ): తెలంగాణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి చెందిన జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన సోదాలు శుక్రవరాం కూడా  కొనసాగాయి. ప్రధానంగా రేవంత్‌రెడ్డికి చెందిన స్థిర, చరాస్తుల వివరాలపై ఆరా తీస్తున్నారు. రేవంత్‌ ఆదాయానికి సంబంధించి ఐటీ శాఖకు చూపిన వివరాల్లో కొన్ని తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి 7 గంటల నుంచి రేవంత్‌ రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. రేవంత్‌ సతీమణి గీతను అధికారులు బ్యాంకు ఖాతాల లావాదేవీలకు సంబంధించి ఆరా తీయడానికి తమ వెంట తీసుకెళ్లారు. రేవంత్‌ ఖాతాల్లోకి విదేశాల నుంచి సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది.. ఆ సొమ్మును ఎక్కడికి మళ్లించారనే విషయాలపై ఐటీ అధికారులు లోతుగా విచారిస్తున్నట్లు సమాచారం. రేవంత్‌తో పాటు సెబాస్టియన్‌, ఉదయ్‌ సింహ, రేవంత్‌ సోదరుడు కొండల్‌ రెడ్డి నివాసాల్లో ఇప్పటికే అధికారుల సోదాలు ముగిశాయి. ఓటుకు నోటు కేసులో నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌ సన్‌కు ఇచ్చిన 50 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయమై సెబాస్టియన్‌, ఉదయ్‌ సింహలను ఐటీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. వారిద్దరికి అధికారులు తాఖీదులు జారీ చేశారు. వచ్చెనెల 1న బషీర్‌ బాగ్‌లోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయానికి హాజరు కావాలని తాఖీదుల్లో పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు రేవంత్‌ నివాసంలో రెండో రోజు కూడా సోదాలు జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్‌ నేతలు డీకే అరుణ, సీతక్క, నరేందర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి తదితరులు అక్కడికి చేరుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లో బలంగా ఉన్న కాంగ్రెస్‌ నేతలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నాయని వారు మండిపడ్డారు. రేవంత్‌కు సంఘీభావం ప్రకటించారు. ఇందుకు ప్రతిఫలం అనుభవించక తప్పదని హెచ్చరించారు.