రేవంత్ బెయిల్ పిటిషన్: కౌంటర్ దాఖలు చేయకపోవడంపై కోర్టు ఆగ్రహం

bwl4rx9d
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అరెస్ట్‌ అయిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఈ పిటిషన్‌పై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలుకు మరోసారి గడువు కోరడంపై ఎసిబి అధికారులపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే రెండుసార్లు గడువు ఇచ్చామని మరోసారి గడువుకోరడం సమంజసం కాదన్నారు. రేవంత్‌రెడ్డికి రేపటితో కస్టడీ ముగస్తుందని, బుధవారం ఉదయం కౌంటర్‌ దాఖలు చేస్తామని ఏసీబీ అధికారులు కోర్టుకు తెలిపారు. దీంతో అంతకు మించి గడువు తీసుకోవద్దని ఎసిబిని న్యాయమూర్తి హెచ్చరిస్తూ విచారణను బుధవారానికి వాయిదా వేశారు. రేవంత్‌రెడ్డికి సౌకర్యాల కల్పనలో ఎసిబి అధికారులు మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు సరైన వసతులు కల్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే రేవంత్‌రెడ్డికి సరైన వసతులే కల్పించామని ఏసీబీ అధికారులు కోర్టుకు వీడియో ఆధారాలు సమర్పించారు. ఈ నెల 11వ తేదీన తన కూతురు నిశ్చితార్థం ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్ రెడ్డి ఎసిబి కస్టడీ మంగళవారం సాయంత్రానికి ముగుస్తుంది.