రేషన్ డీలర్లకు ముప్పు లేదు
సరుకులు పెంచి దుకాణాలను బలోపేతం చేస్తా: ప్రత్తిపాటి
అమరావతి,జూన్15(జనం సాక్షి ): మారుతున్న సరుకుల పంపిణీ తదితర మార్పుల కారణంగా భవిష్యత్‌లో రేషన్ దుకాణాల్ని అన్ని రకాల నిత్యావసరాలు లభించే దుకాణాలుగా రూపొందించాలనే ఆలోచన ప్రభుత్వానికుందని ఎపి పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. డీలర్లకు భరోసా కల్పించేలా చర్యలపై ఆలోచన చేస్తున్నామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 29 వేల మంది రేషన్ డీలర్లున్నారు. వీరితోపాటు దాదాపు మరో 4 వేల మంది హాకర్స్ పౌరసరఫరాశాఖపై ఆధారపడి జీవిస్తున్నారు. దీంతోపాటు వారికి కవిూషన్ పెంచాలా లేక జీతాలివ్వాలా అనే ఆలోచన కూడా వుందన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికీ, ప్రజలకు రేషన్ దుకాణాలు వారధి కానున్నాయి. అన్ని రకాల సరుకుల్నీ విక్రయించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. బియ్యంతో పాటు నిత్యావసరాలైన శనగలు, కందిపప్పు, మినప్పప్పు, పామోలిన్ ఆయిల్, ఉప్పులను రేషన్ షాపుల ద్వారా ఇవ్వాలనుకుంటున్నామని అన్నారు. ప్రతి కార్డుదారుడికీ ఈ సరకులను నెలకు కేజీ చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించాం. మూడు రకాల పప్పు దినుసులను కేజీ రూ. 50 చొప్పున అందజేయాలనుకుంటున్నాం. ఈ సరుకుల్ని కొనుగోలు చేసేందుకు అయిన ఖర్చులో 50శాతం రాయితీలో ఇవ్వాలనేది మరో ఆలోచనగా ఉందన్నారు. దీంతో రేషన్ డీలర్లకు కూడా గిట్టుబాటు కాగలదన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో జరిగే అవకతవకలు, అవినీతిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని కూడా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. రేషన్ దుకాణాలతోపాటు బహిరంగ మార్కెట్లలో ప్రజలు పడే ఇబ్బందులను పరిష్కరించడమే తన ధ్యేమన్నారు. అలాగే ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తానన్నారు. నగదు బదిలీ పథకం ప్రవేశ పెట్టడం ద్వారా ప్రభుత్వం బియ్యాన్ని ఎత్తివేసే ఆలోచన లేదన్నారు. కిరోసిన్ కూడా రాష్ట్రంలో పూర్తిగా రద్దు కాలేదని,గుడిసెల్లో వున్న వారికి పంపిణీ చేస్తున్నామని, పంచదారకు కేంద్రం రాయితీ ఎత్తివేయడంతో దానిని నిలిపేశామన్నారు. బహిరంగ దుకాణాలతో పాటు షాపింగ్ మాల్స్‌లో కూడా అన్ని రకాల వస్తువుల్ని అధిక ధరలకు విక్రయించకుండా వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చాలా చోట్ల పెట్రోల్ బంకుల్లో వినియోగదారులను పెద్ద ఎత్తున మోసగిస్తున్నారనే ఆరోపణలపై నిరంతరం దాడులు చేసున్నామని అన్నారు.