రేషన్‌ షాపుల్లో మొరాయిస్తున్న సర్వర్లు

ఈ పాస్‌కు సాంకేతిక సమస్యలు
రేషన్‌ పంపిణీలో అంతరాయం
గుంటూరు,నవంబర్‌9 (జనం సాక్షి):   ప్రజాపంపిణీ వ్యవస్థలో కీలకమైన ఈ-పోస్‌ యంత్రాలు తరచుగా మొరాయిస్తున్నాయి. దీంతో షాపులకు వచ్చిన లబ్దిదారులకు వెనువెంటనే రేషన్‌ సరుకులు పంపిణీ చేయలేని పరిస్థితి నెలకొంది. సమస్య పరిష్కారం కావడానికి గంటకు పైగా సమయం పడుతుండటంతో కార్డుదారులు సరుకులు తీసుకోకుండానే ఉస్సూరుమంటూ వెనుదిరుగుతున్నారు. ఈ-పోస్‌ యంత్రాలను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాల్సిన విజన్‌టెక్‌ సంస్థ టెక్నీషియన్లు మెషీన్లను జిల్లా కేంద్రానికి తీసుకురమ్మంటున్నారు. దీంతో ఆ రోజు షాపు మూసేయాల్సి వస్తోంది. ఈ కారణాలన్నీ ఆయా షాపుల్లో సరుకుల నిల్వ పెరిగిపోయేందుకు కారణమౌతున్నాయి.  కుటుంబ సభ్యుల పేర్లలో ఎవరో ఒకరు తప్పక షాపునకు వెళ్లి వేలిముద్ర వేసి ఆధార్‌ అథెంటికేషన్‌ జరిగితేనే ఆన్‌లైన్‌లో సరుకుల విడుదల జరుగుతుంది. ఇందుకోసం విజన్‌టెక్‌ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకొంది. ఆ సంస్థ ఐదేళ్ల పాటు ఈ-పోస్‌ పరికరాలకు రిపేర్లు వచ్చినా ఉచితంగా చేసి ఇచ్చేలా అగ్రిమెంట్‌ అయింది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 11 మంది టెక్నీషియన్లను నియమించారు. వారు పౌరసరఫరాల ఉప తహసీల్దార్ల కార్యాలయాల్లో అందుబా టులో ఉండి ఈ-పోస్‌ పరికరాల్లో వచ్చే సాంకేతిక సమస్యలను పరిష్కరించాలి. అయితే మండల స్థాయిలో సమస్యలు పరిష్కారం కావడం లేదు. తరచుగా సర్వర్‌ డౌన్‌, వేలిముద్ర స్కానర్‌, ఎనలాగ్‌ బోర్డు సమస్యలు వస్తున్నాయి. ఇటీవలే కొన్ని 4జీ బోర్డులను ఆ సంస్థ టెక్నీషియన్లు తెప్పించి కొద్దిమంది డీలర్లకు ఇచ్చారు. అయితే అవి బ్లూటూత్‌ని సపోర్టు చేయడం లేదు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి విజన్‌టెక్‌ సంస్థతో మాట్లాడించినా ఉపయోగం లేకుండా పోయిందని డీలర్లు వాపోతున్నారు.