రైతన్నలకు, నేతన్నలకు తోడుగా ఉంటా : విజయమ్మ
కరీంనగర్, జూలై 23 : సిరిసిల్ల పట్టణంలో దీక్ష చేపట్టేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సోమవారం మధ్యాహ్నం 2గంటలకు చేరుకున్నారు. పట్టణంలో గాంధీవిగ్రహం వద్ద ఏర్పాటైన దీక్షా శిబిరంలో ఆమె ప్రసంగించారు. ధర్నాకు వచ్చిన వారందరికీ శుభాభివందనాలు తెలిపారు. ఆమె దీక్షా వేదికపై ఆశీనులవుతుండగా సీమాంధ్ర నేతలు గోబ్యాక్, వైఎస్‌ఆర్ పార్టీ నాయకుడు తెలంగాణకు బద్ద వ్యతిరేకి, తెలంగాణ ప్రాంతంలో తిరగవద్దంటూ దీక్షా శిబిరం ముందు తెలంగాణవాదులు నినాదాలు చేశారు. అనంతరం దీక్షా వేదికపై నుంచి ఆమె మాట్లాడుతూ సిరిసిల్లలోని చేనేత కార్మికులకు మద్దతు తెలిపేందుకు వచ్చానని అన్నారు. జగన్మోహన్‌రెడ్డి జైలులో ఉండకపోతే ఆయనే సిరిసిల్లకు వచ్చి కార్మికులకు మద్దతు తెలిపేవారని అన్నారు. జగన్మోహన్‌రెడ్డి కోరిక మేరకే తాను సిరిసిల్ల చేనేత కార్మికులకు అండగా ఉండేందుకు ఇక్కడికి వచ్చానని అన్నారు. వైఎస్‌ఆర్ కలలు నిజం చేసేందుకే రైతులు, చేనేత కార్మికులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని రైతన్నలు దీనావస్థలో ఉన్నారని, వారు పండించిన పంటకు కనీస మద్దతు ధర కూడా లేకుండా ప్రభుత్వం అణగదొక్కిందని ఆమె ఆరోపించారు. అదేవిధంగా పత్తి రైతుకు కూడా గిట్టుబాటు ధర లేకపోవడం శోచనీయమని అన్నారు. ఇతర దేశాలకు పత్తిని ఎగుమతి చేయడం వల్ల పత్తి రైతుకు గిట్టుబాటు ధర కల్పించలేకపోయారని ఆమె ప్రభుత్వాన్ని విమర్శించారు. మరమగ్గాల కంపెనీల యజమానులకు లాభాలు పెరుగుతున్నాయని.. కానీ చేనేత కార్మికులకు జీతాలు పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి విత్తనాలు, ఎరువులు సరైన సమయంలో రైతులకు అందిస్తే వారి జీవన విధానం మెరుగవుతుందని, ఇందుకోసం ప్రభుత్వం కృషి చేయాలని విజయమ్మ అన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బడుగు, బలహీన వర్గాల పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని, ఆ పథకాలను నేటి ప్రభుత్వం మటుమాయం చేసిందని ఆరోపించారు. చేనేత కార్మికులకు తను పూర్తిగా మద్దతు పలుకుతున్నానని అన్నారు. కొందరు స్వార్ధపరులు రాజకీయపబ్బం గడుపుకునేందుకు తనపై దౌర్జన్యానికి పాల్పడడం దురదృష్టకరమని అన్నారు. చేనేత కార్మికులకు వైఎస్‌ఆర్ ఇచ్చిన హామీలను జగన్ తప్పక నెరవేరుస్తాడన్నారు. ఒకవేళ జగన్ అధికారంలోకి వస్తే వైఎస్‌ఆర్ పాలననే అందిస్తాడని, జగన్ త్వరలోనే బయటకు వస్తాడని చెప్పారు. ఇదిలా ఉండగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కొండ సురేఖ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం అవసరమనుకున్నప్పుడే కేసిఆర్, కేటిఆర్‌లు ఉద్యమాలు నిర్వహిస్తూ అమాయక ప్రజలను ఉసిగొల్లుపుతూ, వారు ఏసీ గదుల్లో కాలక్షేపం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ నినాదంతో కేసిఆర్ కుటుంబం బతుకుతున్నదని, తెలంగాణ నినాదం లేకపోతే ఈ ప్రాంత ప్రజల్లో నిలవలేరని ఆమె అన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ వస్తుందని కేసిఆర్ ఖచ్చితంగా అన్నారని, ఆ నాటికి తెలంగాణ రాకపోతే ఆయన కుటుంబంపై తెలంగాణ ప్రజలే ఎదురుదాడికి తిరుగుతారని ఆమె అన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏనాడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని ఆమె అన్నారు.