రైతన్న సమస్యలపై మరో పోరు

5

– తెలంగాణ తరహాలో ఉద్యమం

– రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ప్రొఫెసర్‌ కోదండరాం

వరంగల్‌ అక్టోబర్‌14(జనంసాక్షి):

రైతుల సమస్యలు పరిష్కారానికి మరో పోరుకు సిద్ధం కావాలని , తెలంగాణ తరహా పోరాటం కొనసాగించాలని తెలంగాణ రైతు జాక్‌ కోకన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. బుధవారం వరంగల్‌లో తెలంగాణ రైతు జెఎసి జిల్లా కమిటి ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన కోదండరాం మాట్లాడుతూ  పంటల అమ్మకం సమయంలో రైతాంగాన్ని దోపిడి నుండి కాపాడేందుకు వ్యవసాయ మార్కెట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-మార్కెట్‌ విధానం అధికారులకు అమలు చేయడం ఇష్టం లేకే రైతుల నుండి వ్యతిరేకత వచ్చిందని మెపంతో అమలును నిలిపివేశారని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం రైతాంగాన్ని మార్కెట్‌ దోపిడి నుండి కాపాడేందుకు వరంగల్‌ జిల్లాలోని కేసముద్రం, ఏనుమాముల మార్కెట్‌లలో ప్రవేశపెట్టారని అయితే ఏనుమాముల మార్కెట్‌లో ఆడ్తిదారులే రైతులతో గొడవ చేయించారనే ప్రచారం జరుగుతుందని కేసముద్రం మార్కెట్‌లో ఆడ్తి వ్యవస్థ లేనప్పుడు అక్కడి రైతులు ఎందుకు వ్యతిరేకించారని ఆ రైతులను ఏ వ్యాపారులు రెచ్చగొట్టారనేది మార్కెటింగ్‌ అధికారులు జవాబు చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని చూస్తున్న ఈ మార్కెటింగ్‌ విధానంపై రైతులకు రైతు సంఘాలకు అవగాహన కల్పించాలని అలా చేయకుండా అమలు చేయడం జరిగిందని అయితే ఈ-మార్కెటింగ్‌ విధానం అధికారులకే ఇష్టం లేదనడానికి నిదర్శనమని అధికారులు వ్యాపారుల మీద, ఆడ్తి వారి మీద, రైతుల మీద నెపం వేసి ఈ-మార్కెట్‌ అమలును ఆపివేశారన్నారు. సమావేశంలో పాల్గొన్న రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ కోట్లకు పడుగలెత్తిన కొందరు ఖరీదుదారులు చిన్న చిన్న ఆడ్తిదారులకు ఆర్థికంగా పెట్టుబడులు పెట్టి రైతుల పంటలను ఖరీదుదారులే కొనుగోలు చేస్తూ మార్కెట్‌పై గుత్తాధిపత్యం సాగిస్తున్నారని దీని వల్ల రైతుల పంటలకు న్యాయమైన ధరలు అందడం లేదన్నారు. రైతు పంటలకు టెండర్‌ పద్దతిన ధరలు నిర్ణయించాలని మార్కెట్‌పై కొందరు వ్యక్తుల గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టి రైతులకు సరైన ధరలు చెల్లించాలని రహస్య టెండర్‌ ద్వారా ధరలు నిర్ణయించాలని రైతుల పంటలను తూకం వేసినప్పుడు దాడ్వాయిలు, గుమాస్తాలు, వ్యాపారులు కుమ్మక్కై రైతులకు చిట్టిరాసి ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ఎలక్ట్రానిక్‌ కాంటాపై పంటను తూకం వేసిన వెంటనే రైతువారీగా ప్రింట్‌ ఇవ్వాలని సూచించారు. మార్కెట్‌ ఆదాయానికి గండికొట్టే జీరో పట్టీలు కాకుండా అసలుతక్‌పట్టీలు అమలు చేయాలని జీరో దందాను అరికట్టి మార్కెట్‌ ఆదాయాన్ని పెంచాలని సూచించారు. మార్కెట్‌ కమిటి ఆధ్వర్యంలో నాణ్యత ప్రమాణాల ప్రకారం ధరలు నిర్ణయించేందుకు వ్యాపారులు కాకుండా నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని మార్కెట్‌ యార్డు పరిధిలోనే అన్ని రకాల వాహనాలకు కావల్సిన విధంగా ఎలక్ట్రానిక్‌ వేబ్రిడ్జీలను ఏర్పాటు చేసి ప్రైవేట్‌ వేబ్రిడ్జీలపై తూకాన్ని నిషేదించాలని మార్కెట్‌లో పనిచేస్తున్న వారికి గుర్తింపు కార్డులిచ్చి కార్డులు లేనివారికి లోనికి రాకుండా నిరోధించి రక్షణ పెంచాలని అన్ని చోట్ల సిసి కెమెరాలు అమర్చాలన్నారు. ఈ-మార్కెటింగ్‌ విధానం అంతా మార్కెట్‌ బైలా ప్రకారం అమలవుతుందని అంతా ఎలక్ట్రానిక్‌ యంత్రాల ద్వారానే జరుగుతుందని ఈ విధానంలో మార్కెట్‌లో లైసెన్స్‌లు పొందిన వారు మార్కెట్‌ వ్యాపారంలో పాల్గొంటారని వ్యాపారమంతా సిసి కెమెరాలు, ఇంటర్నెట్‌లో చూసి లావాదేవీలు జరుగుతాయని అన్నారు. వ్యవసాయ మార్కెట్‌లో రైతులకు జరుగుతున్న మోసాలను దోపిడీని అరికట్టి రైతులకు న్యాయం జరిగే విధంగా మార్కెటింగ్‌ అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలనుకుంటే తాము సూచించిన పరిష్కార మార్గాలను అమలు చేయాలని కోరారు. సమావేశంలో రైతుజాక్‌ జిల్లా కన్వీనర్‌ కూరపాటి వెంకటనారాయణ, రాష్ట్ర కోకన్వీనర్లు మండల వెంకన్న, మోర్తాల చందర్‌రావు, జిల్లా కోకన్వీనర్‌ ఎం.యాదగిరిచార్య, బీరం రాములు, కోటా లక్ష్మారెడ్డి, దేశెట్టి రాంచంద్రయ్య, సోమిడి శ్రీనివాస్‌, సిలివేరు బిక్షపతి, కర్నాటకపు సమ్మయ్య, వీరన్న, బొట్టు కుమారస్వామి, వెంకన్న యాదవ్‌, ఉపేందర్‌రెడ్డి, అద్దునూరి యాదగిరి, డిడిఎం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.