రైతన్న సినిమాను ప్రి ఒక్కరూ చూడాలి


ఓ మంచి ప్రయత్నం చేసిన నారాయణమూర్తి
ప్రశంసించిన మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి
సూర్యాపేట,ఆగస్ట్‌18(జనంసాక్షి): రైతన్న సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన సూర్యాపేటలో రైతన్న చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త చట్టాల ద్వారా ఎదురయ్యే పరిణామాలు, వాటితో కలిగే లాభనష్టాలను రైతన్న సినిమా ద్వారా ఆర్‌ నారాయణమూర్తి అద్భుతంగా చూపించారన్నారు. సమాజహితం కోసం అనేక మాధ్యమాల ద్వారా పలువురు కృషి చేయడాన్ని చూస్తుంటామని.. ఇలా సినిమాల ద్వారా ఎన్‌ శంకర్‌, నారాయణమూర్తి వంటి వ్యక్తులు కృషి చేస్తుంటారన్నారు. తనకు తెలిసిన గంభీరమైన పద్ధతిలో కొత్త వ్యవసాయ చట్టాల ద్వారా కలిగే లాభ నష్టాలపై రైతులను మేల్కొలిపేందుకు నారాయణమూర్తి రైతన్న సినిమా ద్వారా చేసిన ప్రయత్నం అద్భుతమని కొనియాడారు. దశాబ్దాలుగా గత పాలకుల చేతిలో దగాపడిన రైతులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్‌ తీసుకువచ్చిన 24గంటల కరెంటు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు కొత్త చట్టాలతో ఎలా నిర్వీర్యం చేసి, కార్పొరేట్‌ శక్తులకు దాసోహం చేసే సన్నివేశాలు కళ్లకు కట్టినట్లు చూపించారన్నారు. ప్రజాహితాన్ని కోరే సినిమాలు అరుదుగా వస్తుంటాయని, అలాంటిదే ఈ రైతన్న సినిమా అన్నారు. చిత్రంలో మట్టికి, మనిషికి ఉన్న సంబంధాన్ని ఆవిష్కరించారంటూ చిత్రయూనిట్‌కు మంత్రి అభినందనలు తెలిపారు. మంత్రితో కలిసి పలువురు నేతలు చిత్రాన్ని వీక్షించారు.ఇందులో మున్సిపల్‌ చైర్మన్‌ పెరుమళ్ళ అన్నపూర్ణమ్మ, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌ గౌడ్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకట్‌ నారాయణ గౌడ్‌, జడ్పీటీసీ జీడీ భిక్షం, పెన్‌ పహాడ్‌ ఎంపీపీ నెమ్మాది భిక్షం, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పుట్టా కిశోర్‌, మామిడి అనితఅంజయ్య, మార్కెట్‌ చైర్మన్‌ ఉప్పల లిలిత ఆనంద్‌, డైరెక్టర్లు రమణా రెడ్డి, దాచేపల్లి భరత్‌, సల్మా, ఊట్కూరు సైదులు, కౌన్సిలర్లు భాషామియా, అన్నపర్తి రాజేశ్‌, అనంతుల, లింగనాయక్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు చెనగాని రాంబాబు, టీఆర్‌ఎస్‌వీ నాయకులు ముదిరెడ్డి అనిల్‌, పాండు, రమాకిరణ్‌, రఫీ, గట్ల శరన్‌, బాలు, ప్రవీణ్‌ తదితరులు ఉన్నారు.

తాజావార్తలు