రైతుబంధు చెక్కుల దుర్వినియోగంలో అధికారులు
కూపీ లాగి నిందితులను గుర్తించామన్న పోలీసులు
వివరాలు వెల్లడిరచిన అదనపు ఎస్పీ నర్మద
నల్లగొండ,అక్టోబర్14 (జనం సాక్షి) : జిల్లాలో గత కొద్ది రోజులుగా సంచలనం సృష్టిస్తున్న రైతుబంధు చెక్కుల దుర్వినియోగం కేసును నల్లగొండ జిల్లా పోలీసులు ఛేదించినట్లు అదనపు ఎస్పీ నర్మద తెలిపారు. దళారీలు, కొందరు అధికారులు కలసి చెక్కులను దుర్వినియోగం చేసినట్లు గుర్తించామన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎఎస్పీ కేసు వివరాలను వెల్లడిర చారు. రైతు బంధు పథకంలో భాగంగా జిల్లాలోని గుర్రంపోడు, పెద్ద అడిశర్లపల్లి, చింతపల్లి, నాంపల్లి, చండూర్ మండలాల పరిధిలో రైతాంగానికి చెక్కులు పంపిణీ చేశారు. అయితే చనిపోయిన వారి పేర్ల విూద, భూమి వివరాలు తప్పుగా పడిన వారి పేర్ల విూద, ఇతర ప్రాంతాలలో ఉంటూ చెక్కులు తీసుకోని రైతుల పేర్ల విూద వచ్చిన చెక్కులను కొందరు రెవెన్యూ అధికారులు, దళారీలు, బ్యాంకు అధికారులతో కుమ్మక్కయ్యారు. అక్రమంగా 547 చెక్కుల ద్వారా రూ. 61,50,460 నగదును అక్రమంగా డ్రా చేశారని అదనపు ఎస్పీ నర్మద వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో అయిదు మండలాల పరిధిలో అయిదు క్రిమినల్ కేసులను నమోదు చేసి 23 మందిని రిమాండ్ కు తరలించినట్లు ఆమె వివరించారు. ఈ కేసు విచారణలో సమర్థవంతంగా పని చేసిన దేవరకొండ డీఎస్పీ ఆనంద్ రెడ్డి, నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, మల్లేపల్లి సీఐ రవీందర్, నాంపల్లి సీఐ సత్యం, చండూర్ సీఐ మధు, గుర్రంపోడు ఎస్.ఐ. శీనయ్య, గుడిపల్లి ఎస్.ఐ. వీరబాబు, నాంపల్లి ఎస్.ఐ. రఫీ, చింతపల్లి ఎస్.ఐ. వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బందిని ఆమె అభినందించారు.