‘రైతుబంధు’ దేశవ్యాప్తంగా అమలు చేయాలి

– కేంద్ర ఆర్థిక శాఖ మాజీ సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌
న్యూఢిల్లీ, జులై11(జ‌నం సాక్షి) : అన్నదాతలకు అండగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంపై కేంద్ర ఆర్థిక శాఖ మాజీ ముఖ్య సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ ప్రశంసల వర్షం కురిపించారు. రైతు బంధు పథకం అన్నదాతల్లో మనోధైర్యాన్ని నింపిందని, ఈ పథకంతో రైతుల ఆదాయం పెరుగుతుందని కొనియాడారు. అన్నదాతల ఆర్థిక, సామాజిక ప్రగతికి రైతు బంధు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆంగ్ల పత్రిక ‘ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌’లో ఓ కథనాన్ని రాశారు. ఈ విషయాన్ని ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ‘వ్యవసాయ రంగంలో సామాజిక మార్పులకు రైతుబంధు దోహదపడుతుందని, దేశవ్యాప్తంగా సంక్షోభం ఎదుర్కొంటున్న వ్యవసాయ రంగానికి రైతు బంధు పథకం ఊరటనిస్తుందన్నారు. ఈ పథకం అన్ని రాష్ట్రాల్లో ఆచరించదగిందన్నారు. రైతు బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని అరవింద్‌ సుబ్రమణియన్‌ అభిప్రాయపడ్డారు. పాలకుల చర్యల వల్ల సామాన్యులకు పెద్దగా ప్రయోజనం చేకూరండంలేదని.. రైతు బంధుతో మేలు జరుగుతుందని అరవింద్‌ సుబ్రమణియన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా అన్నదాతల ఆదాయం పెరుగుతుందని.. అది ఆర్థిక సామాజిక ప్రగతికి దోహదపడుతుందని పేర్కొన్నారు.