రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు

నిజామాబాద్‌,నవంబర్‌11(జ‌నంసాక్షి): మార్కెటింగ్‌ అధికారులు ధాన్యం కొనుగోళ్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలులో రైతులకు నష్టం జరగకుండా గిట్టుబాటు ధర దక్కేలా చూడాలని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాలతో కమిటీ పాలకవర్గాలు నడుం బిగించాయి. మధ్య దళారులను పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. రైతులు పండించిన అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేలా కొనుగోలు జరిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతుబందు పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. రైతులకు నష్టం లేకుండా కొనుగోళ్లు చేస్తామని వ్యవసాయ శాఖ జెడి తెలిపారు. వరిధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందులు పెట్టకూడదని రైసు మిల్లర్లు, కవిూషన్‌ ఏజెంట్లను మంత్రి ఆదేశించడంతో ఆయా మార్కెట్లకు ఆదేశాలు అందాయి. బీపీటీ వరి రకానికి బహిరంగ మార్కెట్లో ధర తగ్గించి కొనుగోలు చేయటం సరికాదన్నారు. ధర తగ్గించటం వెనుక దళారుల పాత్ర ఉందన్నారు. నీళ్లు సమృద్ధిగా ఉన్నందున రబీలో కూడా పంటలు విస్తారంగా సాగవుతాయన్నారు. రైసు మిల్లర్ల సమస్యలు కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో రైతులకు కావాల్సిన సేవలను అందించాలని నూతన పాలకవర్గం సభ్యులకు, అధికారులకు సూచించారు. మార్కెట్‌ ఫీజు సక్రమంగా వసూలు చేసి ఆదాయాన్ని పెంపొందించాలని సిబ్బందికి ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు మార్కెట్‌ కమిటీల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.