రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు

జనగామ,అక్టోబర్‌10(జ‌నంసాక్షి):  రైతులు ఆరబెట్టిన వరిధాన్యాని తాలు, చెత్త లేకుండా కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకొని వచ్చేలా అవగాహన కల్పించాలని అధికారులకు కలెక్టర్‌ టీ వినయ్‌కృష్ణారెడ్డి సూచించారు. ఎక్కువ సమయం లేకుండా త్వరగా తూకం వేయడానికి కూడా వీలు కలుగుతుందన్నారు.
వానాకాలం సీజన్‌లో వరి ధాన్యం కొనుగోళ్లకు సిద్ధం కావాలని కోరారు. జిల్లా కేంద్రంలో డీఆర్‌డీఏ, గ్రావిూణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు  శిక్షణ కార్యక్రమం పూర్తి చేశారు.మహిళలు గతంలో వరిధాన్యం కొనుగోలు చేసి రైతులకు సేవలు అందించి ప్రభుత్వానికి మంచి పేరు ప్రతిష్ట తెచ్చారని కొనియాడారు. రానున్న వానాకాలంలో సీజన్‌లో కూడా రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కొనుగోలు కేంద్రాలు నిర్వహించాల్సి ఉందన్నారు. ధాన్యం అమ్మిన  7రోజుల్లో రైతు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చూడాలని ఆదేశించారు. ఏగ్రేడ్‌-ధాన్యంకు క్వింటాల్‌ రూ.1770, కామన్‌ రకానికి రూ.1750 పొందవచ్చని చైతన్యం చేయాలన్నారు. సివిల్‌సైప్లె, డీఆర్‌డీఏ అధికారులు కేంద్రాలు నిర్వహించే మహిళలకు అన్ని విధాలుగా సాయం చేయాలని, వరిధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని ఆయన సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో రైతులకు ప్రభుత్వ మద్దతు ధర అందించేలా కొనుగోలు కేంద్రాలు నిర్వహించే మహిళలు చూడాలని, అవసరమైతే కొత్త కేంద్రాలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు.

తాజావార్తలు