రైతులకు గిట్టుబాటు ధరలు
గుంటూరు,ఫిబ్రవరి14(జనంసాక్షి): రైతులు పండించిన వరి, పత్తి ఇతర పంటలకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటోందని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ చెప్పారు. రైతుకు కనీస మద్దతు ధరకు తక్కువ కాకుండా లాభసాటి ధర అందాల్సి ఉందని పేర్కొన్నారు.వివిధ శాఖల అధికారులతో ధాన్యం సేకరణ, పత్తి కొనుగోలు, ఉపాధి హావిూ పథకం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం అంశాలపైసవిూక్ష నిర్వహించాక రైతులకు హావిూ ఇచ్చారు. జిల్లాలో 2.5 లక్షల హెక్టార్లలో వరి పంట వేశారని, 90 శాతం బీపీటీ రకం కాగా పది శాతం సాధారణ రకమన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర రూ.1050 కన్నా ఎక్కువ ధర బీపీటీ రకానికి ఉందన్నారు. ఇప్పటి వరకు రైస్‌మిల్లర్లు 50 వేలు టన్నుల ధాన్యాన్ని కొన్నారని చెప్పారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం 4,500 టన్నుల కొనుగోలు చేసిందన్నారు. ఇదిలావుంటే రాజధాని నిర్మాణ కమిటీలో రైతుల భాగస్వామ్యం ఉండాలని, దీనిలో వారికి ప్రాతినిధ్యం లేకుండా ప్రభుత్వం ఏకపక్ష వైఖరి అవలంబిస్తుందని స్థానిక కాంగ్రెస్ నేతలు విమర్శించారు. రాజధానిని ఈప్రాంతంలో నిర్మించాలనుకొన్నప్పుడు ఈప్రాంత రైతులతో ముఖ్యమంత్రి ముందుస్తు చర్చలు జరిపినట్లయితే ఇంత రాద్దాంతం ఉండేదికాదని మాజీ ఎంపీపీ మ్లలెల హరేంద్రనాథ్ అన్నారు. రాజధాని నిర్మాణానికి ఇన్నివేల ఎకరాల భూమి అవసరం ఉన్నప్పుడు భూసేకరణ అసాధ్యమని భావించిన ప్రభుత్వం భూసవిూకరణ చేపట్టిందని అన్నారు. భూసవిూకరణలో రైతులు తమ ఇష్టపూర్వకంగా మాత్రమే భూములు ఇవ్వాల్సి ఉందన్నారు. ప్రస్తుతం రైతులు తమ అంగీకారాన్ని మాత్రమే తెలియజేస్తున్నారని ఇది కేవలం వీలునామా లాంటిదేనని చెప్పారు. ప్రభుత్వ విధానాల పట్ల జరీబు ప్రాంతరైతులంతా ప్రతిఘటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోందని వారికి అండగా ఉండి వారి ప్రయోజనాలను కాపాడేందుకు తాను సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు.