రైతులు బాగుంటేనే రాష్ట్రప్రగతి

3

– ప్రొ కోదండరాం

హైదరాబాద్‌,డిసెంబర్‌30(జనంసాక్షి):రైతులు బాగుంటేనే రాష్ట్రం ప్రగతిదిశలో పయనిస్తుందని జేఏసీ కన్వీనర్‌ ప్రోఫెసర్‌ కోదండరాం తెలిపారు. ఇటీవల రైతుల ఆత్మహత్యలకు ప్రధానకారమేంటో తెలసుకోవాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల  నేపథ్యంలో తెలంగాణ సర్కారు రైతుల ఆత్మహత్యలపై కారణాల విశ్లేషణకు బుధవారం సమావేశమైంది. ఈ సమావేశానికి వ్యవసాయ, ఇరిగేషన్‌, రెవెన్యూ, మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అలాగే ఈ భేటీలో రైతు సంఘం ప్రతినిధులు, తెలంగాణ రైతు జేఏపీతో పాటు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరామ్‌ మాట్లాడుతూ రైతుల సమస్యపై నిర్వహించిన సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి రాకపోవడం బాధాకరమన్నారు. రైతు బాగుంటేనే  రాష్ట్ర ప్రగతితో పాటు రాజకీయ సుస్థిరత, ఆర్థిక ప్రగతి బాగుంటుందన్నారు. ఏకకాలంలో రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అలాగే రైతుల సమస్యలను తీర్చడమే అజెండాగా ప్రభుత్వం పని చేయాలని కోదండరామ్‌ సూచించారు. కాగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడటానికి ప్రధాన కారణాలేమిటో తెలుసుకోవాలని హైకోర్టు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన విషయం తెలిసిందే. మూలాల్లోకి వెళ్లి వెతికితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొంది.