రైతుల పక్షాలన నిలబడినందుకే జగన్ కక్షగట్టారు
– తన పత్రికలో తనపై తప్పు ప్రచారం చేస్తున్నారు
– తెదేపా ఎమ్మెల్యే యరపతినేని
గుంటూరు, ఆగస్టు16(జనం సాక్షి ) : సరస్వతీ సిమెంట్స్ భూముల విషయంలో రైతుల పక్షాన నిలబడినందుకే వైకాపా అధ్యక్షుడు జగన్ తనపై కక్షగట్టారని గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. గురువారం గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులతో కలిసి విూడియా సమావేశంలో పాల్గొన్న యరపతినేని.. వైకాపా నేతలపై మండిపడ్డారు. అక్రమ మైనింగ్ వెనుక తనపాత్ర ఉందని 4ఏళ్లుగా సాక్షి పత్రిక బురదజల్లడం రాజకీయ లబ్ధి కోసమేనని కొట్టిపారేశారు. 2011లో కాంగ్రెస్ పాలనలోనే అక్రమ మైనింగ్ జరుగుతుందని లోకాయుక్తకు పిర్యాదులు వెళ్లాయని, అప్పటి ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి స్వయంగా ముఖ్యమంత్రికి లేఖ రాసిన విషయాన్ని యరపతినేని గుర్తు చేశారు. మళ్లీ వారే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక పిటిషన్లు వేశారని దీనివెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. 2014 తరువాత అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పడం రాజకీయ కుట్రేనని యరపతినేని వ్యాఖ్యానించారు. సీబీఐ అధికారులను గతంలో దూషించిన వైకాపా నేతలే సీఐబీ విచారణ కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గురజాల నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని… దొంగే దొంగ అన్నట్లు వైకాపా నేతలు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆంజనేయులు ఆరోపించారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో తన ఆస్తులను కాపాడుకోవడం కోసం కేటీఆర్ ను పొగుడుతున్నారన్నారు. లోకేష్ కు మంత్రిగా అర్హత లేదని చెప్పడానికి ఆయనెవరిని ప్రశ్నించారు.
———————