రైతుల సంక్షేమమే సిఎం కెసిఆర్‌ లక్ష్యం: ఎంపి

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నంసాక్షి): రైతు సంక్షేమం గురించి సీఎం కేసీఆర్‌ నిత్యం ఆలోచిస్తున్నారని అందుకే రైతు సమన్వయ సమితుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని ఎంపి గోడం నగేశ్‌ అన్నారు. అందులో భాగంగానే ఎకరాకు నాలుగు వేల పెట్టుబడి పథకం రూపుదిద్దుకుందని చెప్పారు. జిల్లాలో

ప్రాజెక్టులు పూర్తిచేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని చెప్పారు. కోటిన్నర ఎకరాలకు సాగునీరు, 24 గంటల నాణ్యమైన విద్యుత్తు, గిట్టుబాటు ధర, నాణ్యమైన విత్తనాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. రైతుల బలోపేతానికి రైతు సంఘాల ఏర్పాటుతోపాటు భూమి రికార్డుల సమగ్ర ప్రక్షాళన కార్యక్రమం చేపడుతున్నట్టు వివరించారు. అయితే కాంగ్రెస్‌ నేతలు కోర్టుల్లో కేసులు వేస్తూ, సాగునీటి ప్రాజెక్టులకు అడ్డుపడుతూ తెలంగాణ అభివృద్దిని అడ్డుకుంటున్నారని ఎంపి మండిపడ్డారు. సోమవారం నాడిక్కడ మాట్లాడుతూ కాంగ్రెస్‌ నేతలు చరిత్రహీనులుగా మారరాదని సూచించారు. రానున్న ఎన్నికల్లో రాజకీయ సన్యాసం తప్పదని భావించి, ఉనికి కోసం రైతుల నోట్లో మట్టికొట్టే విధంగా వ్యవహరించడం తగదని హితవు పలికారు. అధికారంలో ఉన్నప్పుడు కాసులకు కక్కుర్తి పడిన కాంగ్రెస్‌ నేతలు రైతుల సంక్షేమాన్ని విస్మరించారని, ప్రాజెక్టులను గాలికొదిలారని, ఇప్పుడు మాత్రం ఉనికి కోసం పనిచేసే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పార్టీ నేతల మాటలు నమ్మవద్దని రైతులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ అంటేనే కాలం చెల్లిన పార్టీ అని, అభివృద్ధికి అడ్డం పడటమే వారు చేస్తున్న కార్యక్రమాలని నగేశ్‌ పేర్కొన్నారు.