రైతు క్లబ్బుల ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకోండి
నాబార్డ్ అసిస్టెంట్ మేనేజర్ నరేంద్రకుమార్
కురిచేడు, జూలై 18 : రైతు క్లబ్బుల ద్వారా గ్రామాలను అభివృద్ది పరుచుకోవచ్చునని నాబార్డ్ అసిస్టెంట్ మేనేజర్ ఎంపి నరేంద్రకుమార్ అన్నారు. మండలంలోని పెద్దవరం గ్రామంలో బుధవారం రైతు క్లబ్బును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్లబ్ ద్వారా ఇంతవరకు గ్రామంలో బ్యాంకుల ద్వారా రుణాలు పొందనివారు రుణాలు పొందవచ్చని, పాత బకాయిలు సకాలంలో చెల్లించి కొత్త రుణాలు పొందవచ్చని ఆయన అన్నారు. అంతేకాక వ్యవసాయానికి సంబంధించి సలహాలు, సూచనలు, పశువులకు వ్యాధులు రాకుండా వ్యాక్సిన్ వేయించుకోవచ్చని అన్నారు. గ్రామాలలో సమస్యలను కూడా ఈ క్లబ్‌ల ద్వారా పరిష్కరించుకోవచ్చని అన్నారు. గేదెలకు 50 వేల నుండి ఐదు లక్షల వరకు రుణాలు పొందవచ్చని, అలాగే 40 గొర్రెలకు కూడా రుణాలు పొందవచ్చని వీటికి సబ్సిడీ ఓసిలకు 1/42, ఎస్సీలకు 33 శాతం సబ్సిడీ కల్పిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కురిచేడు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్ పెరుమాళ్లు, ఆంధ్రప్రగతి గ్రామీణబ్యాంకు రీజనల్ మేనేజర్ సాయిప్రసాద్, రైతులు పాల్గొన్నారు.