రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం 

పంటలు,మద్దతు ధరలపై చర్చకు అవకాశం
సిద్దిపేట,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): ఇప్పటికే రైతు బంధు పథకంతో పెట్టబడి సాయం, రైతుబీమా అమలు చేసిన ప్రభుత్వం ఇక రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ విస్తీర్ణాధికారి పరిధిలోని ప్రధాన గ్రామాల్లో ఒక వేదిక నిర్మించేందుకు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి ఇటీవల ప్రతిపాదనలు పంపించారు. రైతు వేదికల వద్ద రైతులు సమావేశం ఏర్పాటు చేసుకొని వారి పంటల మద్దతు ధర, వాతావరణ, సీజన్ల వారీగా సాగు చేయాల్సిన పంటల తదితర వాటిని చర్చించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారు. ప్రతి మూడు గ్రామాల పరిధిలో ఒకటి, మండల కేంద్రాల్లో మరొకటి మొదటి విడుతలో నిర్మించనున్నారు. వేదికల నిర్మాణం కోసం ఇప్పటికే జిల్లాలోని అన్ని వ్యవసాయశాఖ క్లస్టర్‌ గ్రామాల్లో భూములను సైతం గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా సిద్దిపేట, గజ్వేల్‌, హుస్నాబాద్‌, దుబ్బాక, చేర్యాలతో పాటు ఆయా ప్రధాన గ్రామాల్లో 121 రైతు వేదికలు నిర్మించేందుకు సంబంధితశాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. వ్యవసాయశాఖ అధికారులు ప్రతి 5వేల ఎకరాలకు వ్యవసాయ విస్తీర్ణాధికారి పరిధిని ఏర్పాటు చేశారు. ఇదే ప్రతిపాదికన రైతు వేదికలు నిర్మాణానికి నోచుకోనున్నాయి. రైతు వేదికలో ఏఈవో కార్యాలయం, రైతులకు ప్రభుత్వం పంపిణీ చేసే ఎరువులు, విత్తనాలు, సబ్సిడీ పరికరాల నిల్వ కోసం, టాయిలెట్స్‌, సమావేశపు గది నిర్మాణాలతో పాటు ప్రహరీ నిర్మించడంతో పాటు మైక్‌సెట్‌, ప్యాన్లు, తాగునీరు తదితర వసతులు కల్పించనున్నారు. అలాగే రైతులు వారి భూములను పరీక్షలు చేయించుకునేందుకు భూసార పరీక్షా కేంద్రాలను అందులో ఏర్పాటు చేయనున్నారు.ఆయా నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు రైతు వేదికల నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.