రైతు సమన్వయ సమితులతో భూ లెక్కలు

పక్కాగా చేపట్టాలన్న మంత్రి ఇంద్రకరణ్‌

నిర్మల్‌,సెప్టెంబర్‌1జ‌నంసాక్షి ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం పాత విధానాలకు స్వస్తి పలుకుతూ కొత్తకు నాంది కానుందని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. భూమి రికార్డులను సమగ్రంగా ప్రక్షాళన చేసి, రైతులకు పక్కాగా పట్టాదార్‌ పాసుపుస్తకాలు అందించాలని ఆదేశించారు. ఏ భూమి ఎవరి ఆధీనంలో ఉందో తేల్చి, భూమి హక్కులపై స్పష్టత ఇవ్వాలన్నారు. నిర్మల్‌ జిల్లాలోని ఎల్లపల్లిలో రైతు సమన్వయ సమితిని శుక్రవరాం మంత్రి ఏర్పాటు చేశారు. రైతు సమన్వయ సమితిల ఏర్పాటు మహత్తరమైన కార్యక్రమమని ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. రైతుల సంక్షేమం కోసం రైతు సమన్వయ సమితిలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. రైతులు భరోసాగా బతికేందుకు రైతు సమన్వయ సమితిలు ఎంతో తోడ్పడతాయని ఆయన చెప్పారు.

భూముల నిర్వహణను నిర్లక్ష్యం చేయడం వల్ల్నే ఇవాళ సర్వే చేయాల్సి వస్తోందని అన్నారు. రికార్డుల ప్రక్షాళన ద్వారా అన్ని వివాదాలకు చరమగీతం పాడాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని అన్నారు. రైతులకు సాగునీరు అందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, పెట్టుబడికోసం ఎకరాకు ఏడాదికి రూ.8 వేలు వచ్చే ఏడాదినుంచి ఇస్తున్నామని అన్నారు. భూ రికార్డులు సరిగ్గా లేకపోవడంతో అనేక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిజమైన రైతుల అకౌంట్లలో డబ్బులు జమ కావాలంటే భూమి రికార్డులు పక్కాగా ఉండాలని చెప్పారు. సర్వేతో ఏ భూమి ఎవరి ఆధీనంలో ఉందో తేల్చి, భూమి హక్కులపై స్పష్టత రానుందన్నారు. ప్రభుత్వ భూములు, ఫారెస్ట్‌, అసైన్డ్‌, దేవాదాయ, వక్ఫ్‌ తదితర భూముల వివరాలు నమోదు చేయాలని అన్నారు. రెవెన్యూ గ్రామం యూనిట్‌గా వ్యవసాయ భూములు, ప్రభుత్వ భూములు, ప్రభుత్వం సేకరించిన వ్యవసాయ భూముల వివరాలు సేకరించాలన్నారు. అందుకే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రభుత్వమే పూనుకొని, అసంఘటితంగా ఉన్న రైతులను సంఘటితం చేస్తున్నదన్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితి పంటను కొనుగోలు చేసి, ప్రాసెసింగ్‌ చేసే హక్కులను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. దీనిద్వారా రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది అని వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పలుఉవరు నేతలు పాల్గొన్నారు.