రైతు సమస్యలపై ఐకాసా అధ్యయనం

ఆదిలాబాద్‌,మార్చి31(జ‌నంసాక్షి): రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులు అధ్యయనం చేయటానికి ఈ నెల 5వ తేదీ నుంచి తెలంగాణ ఐకాస  పర్యటించనుంది. ప్రజా సమస్యల అధ్యయనంలో భాగంగా తొలివిడతలో రైతుల సమస్యలను కన్వీనర్‌ ఆచార్య కోదండరాం ఆధ్వర్యంలో పరిశీలిస్తారు. జిల్లాలో వర్షాలు కురవక ఇబ్బందుల్లో ఉన్న రైతుల పరిస్థితి అధ్యయనం చేయటానికి యాత్ర చేపట్టనున్నట్లు జిల్లా నాయకులు  చెప్పారు. బిద్రేల్లి నుంచి కరవు యాత్ర ప్రారంభిస్తారని జిల్లా ఐకాస బాధ్యుడు విజయ్‌కుమార్‌ తెలిపారు.  బిద్రెల్లిలో నెలకొన్న నీటి పరిస్థితులతో పాటు రైతులతో ప్రత్యేక సమావేశమై కరవు పరిస్థితిని అడిగితెలుసుకుంటారని చెప్పారు. అక్కడి నుంచి నియోజకవర్గంలోని భైంసా, కుభీరు, కుంటాల, లోకేశ్వరం విూదుగా నిర్మల్‌ చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేసి 6వ తేదీన ఉదయం నేరడిగొండ విూదుగా ఆదిలాబాద్‌ చేరుకుంటుందన్నారు. ఆదిలాబాద్‌లో రైతులతో సమావేశమై జిల్లా కలెక్టర్‌ జగన్మోహన్‌కు కరవు పరిస్థితులపై వినతి పత్రాన్ని సమర్పిస్తారని చెప్పారు.