రైలు ప్రయాణికులకు ఊరట

– ఆన్‌లైన్‌లోనే రద్దయిన రైలు టికెట్ల నగదు వాపస్‌
న్యూఢిల్లీ, మే5(జ‌నం సాక్షి ) : కుటుంబంతో కలిసి రైలులో ఊరు వెళ్లాలంటే ముందుగానే టికెట్లను రిజర్వు చేసుకోవాల్సిన పరిస్థితి. తీరా.. మనం వెళ్లాల్సిన రైలు రద్దయితే.. మరో మార్గం చూసుకుంటాం. అయితే టికెట్ల కోసం వెచ్చించిన సొమ్ము కోసం ఏం చేస్తాం..? ఇప్పటివరకు రైల్వే అధికారులు ఇచ్చే టికెట్‌ డిపాజిట్‌ రశీదు (టీడీఆర్‌)ను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని తిరిగి పొందుతున్నాం. ఇక నుంచి అటువంటి పద్ధతికి రైల్వే శాఖ స్వస్తి చెప్పింది. ‘రైలు ప్రారంభ స్టేషన్‌ నుంచి చివరి స్టేషన్‌ వరకు సేవలు రద్దు అయితే వెంటనే టికెట్‌ పీఎన్‌ఆర్‌(ప్యాసింజర్‌ నేమ్‌ రికార్డ్‌) కూడా క్యాన్సిల్‌ అవుతుంది. ప్రయాణికులు ఏ ఖాతా నుంచి టికెట్‌ను బుక్‌ చేసుకున్నారో దానికే నగదు వాపస్‌ అవుతుందని’ రైల్వే శాఖ ట్వీట్‌ చేసింది. ఎటువంటి టీడీఆర్‌ను సమర్పించాల్సిన అవసరం ఉండదు. పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సిందిగా సూచించింది. రైలు ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా పలు సేవలను
రైల్వే శాఖ ప్రవేశపెడుతోందని, అందులో భాగంగా అత్యవసర సందర్భల్లో చివరి నిమిషంలోనూ తత్కాల్‌ పద్ధతి ద్వారా టికెట్లను బుక్‌ చేసుకునే సౌలభ్యం కల్పించింది. వేసవి కాలంలో అత్యంత రద్దీగా ఉండే రూట్లలో తక్కువ సమయంలోనే తత్కాల్‌ టికెట్లు బుక్‌ అవుతున్నాయి. అయితే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో తలెత్తే చిన్న చిన్న అవాంతరాలు వల్ల టికెట్లను పొందేందుకు ప్రయాణికులు స్వల్పంగా ఇబ్బందిపడుతున్నారు.