రైలు బోగిని ఢీకొన్న లారి

3

– ఐదుగురు మృతి

– మృతుల్లో మహారాష్ట్ర ఎమ్యెల్యే

అనంతపురం,ఆగస్ట్‌ 24 (జనంసాక్షి) :

ఓ లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా రైలు ప్రమాదం జరగడమే గాకుండా అందులో ఓ ఎమ్మ్యేలతో సహ పలువురు దుర్మరణం చెందారు. అనంతపురం జిల్లాపెనుకొండ మండలం మడకశిర వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. సాధారణంగా ఇతర వాహనాలను రైలు ఢీకొంటే ఇక్కడ రివర్స్‌లో రైలునే ఓ లారీ ఢీకొంది. మడకశిర రైల్వేగేటు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రైలు ప్రమాదంలో కనీసం ఐదుగురు మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రానైట్‌తో వెళుతున్న ఓ లారీ అదుపు తప్పి మడకశిర లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ హెచ్‌1 బోగిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గ్రానైట్‌ రాయి రైలు బోగిపై పడిపోయి దెబ్బతింది. ఈ సంఘటనలో మరో మూడు బోగీలు పక్కకు పడిపోయాయి. లారీ డ్రైవరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని భావించినా, అతను పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో హెచ్‌1 బోగి ఏసీ టెక్నిషియన్‌ అహ్మద్‌, కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లా దేవదుర్గ్‌ ఎమ్మెల్యే వెంకటేష్‌నాయక్‌, ఇండోఫిల్‌ ఇండ్రస్టీస్‌ జనరల్‌ మేనేజర్‌ రాజు, రాయ్‌చూర్‌ కు చెందిన పుల్లారావు, ఉన్నారు. ఈ ప్రమాదంలో జగదీశ్‌(రాయచూర్‌), ఆయన భార్య శాంత, సురేష్‌(దావణగిరి, కర్ణాటక) తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా బెంగళూరులోని రైల్వే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రైలు ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ముమ్మర చేశారు. ట్రాక్‌ క్లియర్‌ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రమాదంలో బాగున్న బోగీలను తరలించే ఏర్పాటు చేశారు. ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అలాగే నాందేడ్‌ ఎక్స్‌ ప్రెస్‌ ప్రమాదానికి గురవ్వడంతో పలు ఎక్స్‌ ప్రెస్‌ రైల్లను దారి మళ్లించారు. బెంగుళూరు నుంచి గుంతకల్లు వెళ్తున్న రైళ్లను వయా కాట్పాడి, జోలార్‌ పేట, పాకాల, ధర్మవరం జంక్షన్‌ విూదుగా నడుస్తాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. తెల్లవారు జామున 2 గంటల నుంచి అనంతపురంలో ఆగిన నిజాముద్దీన్‌ – బెంగళూరు సిటీ రాజధాని ఎక్స్‌ ప్రెస్‌ ను పాకాల విూదుగా మళ్లించారు.బాధితులను ఆదుకునేందుకు, కుటుంబసభ్యులకు సమాచారం తెలియజేసేందుకు అధికారులు ప్రత్యేక హెల్ప్‌ లైన్‌ నెంబర్లను ఏర్పాటు చేశారు. పెనుకొండ ఆర్డీఓ కార్యాలయం హెల్ప లైన్‌ నెంబరు 08555- 220228,ఘటనాస్థలిలో హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ – 97013 74062,ధర్మవరం హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ 08559 222555,అనంతపురం రైల్వే హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ 08554 236444లను అందుబాటులోకి తెచ్చారు.

లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణం: డీఆర్‌ఎం

మడకశిర రైల్వే క్రాసింగ్‌ వద్ద జరిగిన ప్రమాదానికి లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమని రైల్వేశాఖ అధికారులు ప్రకటించారు. లారీ బ్రేకులు ఫెయిలైనట్లు నిర్దారణ అయ్యిందని.. అయినప్పటికీ డ్రైవర్‌ వేగంగా లారీని నడపడంతో అదుపు చేయలేకపోయాడని బెంగళూరు డీఆర్‌ఎం తెలిపారు. లారీ రైల్వేగేటును వేగంగా ఢీకొని తర్వాత బోగీని ఢీకొన్నట్లు వెల్లడించారు. లారీని అదుపు చేయలేనంత వేగంగా నడపడమే ప్రమాదానికి కారణంగా ఆయన వెల్లడించారు. లారీని బోగీని వేగంగా ఢీకొనడంతో లారీలో ఉన్న గ్రానైట్‌ బండరాయి ఎగిరి బోగీలోకి దూసుకెళ్లి అవతలి వైపు నుంచి బయటకు వచ్చింది. దీంతో ఏసీ బోగీలోని కొందరు ప్రయాణీకులు బండరాయి తగిలి గాయపడ్డారు. బండరాయి వేగంగా దూసుకురావడంతో ఎమ్మెల్యే తల తెగిపడినట్లు ప్రత్యక్ష్యసాక్షులు తెలిపారు.

రైళ్ల దారి మళ్లింపు

రైలు ప్రమాద ఘటనతో గుంతకల్లు-బెంగళూరు మార్గంలో రైళ్లన్నీ నిలిచిపోయాయి. సుమారు గంటన్నర పాటు ఎక్కడి రైళ్లు అక్కడే ఆపేశారు. అనంతరం రైలు ఉన్నతాధికారులు సూచన మేరకు రైళ్లను దారి మళ్లించారు. రైళ్ల సమయాలు, వాటి మార్గాలకు అనుగుణంగా ధర్మవరం-పాకాల, తాడిపత్రి-రేణిగుంట, బళ్లారి-చిత్రదుర్గ, కడప, రేణిగుంట మార్గాల్లో మళ్లిస్తున్నారు. రైళ్ల రాకపోకల సమయాలు, మార్గాలు మారిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మార్గాల్లో ప్రయాణించే అన్ని రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. మధ్యాహ్నం మూడు గంటల్లోగా ప్రమాదానికి గురైన రైలును పట్టాల నుంచి తప్పించి… రాకపోకలను పునరుద్ధరిస్తామని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

మంత్రుల సందర్శన

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం మడకశిర వద్ద జరిగిన రైలు ప్రమాదంపై ఆంధప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప విచారం వ్యక్తం చేశారు. ఘటనపై నివేదిక అందజేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. రైలు ప్రమాదంలో గాయపడిన వారి పరిస్థితిపై ఆంధప్రదేశ్‌ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ సవిూక్షించారు. పెనుకొండ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రులు కామినేని, ప్లలె రఘునాథరెడ్డి పరామర్శించారు. క్షతగాత్రులను మెరుగైన వైద్య అందించాలని వైద్యులను ఆదేశించారు.

ఎమ్మెల్యే మృతిపై సర్వత్రా దిగ్భ్రాంతి

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం మడకశిర రైల్వే క్రాసింగ్‌ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగినరైలు ప్రమాదంలో కర్ణాటక రాయ్‌చూర్‌ జిల్లా దేవదుర్గ ఎమ్మెల్యే వెంకటేష్‌నాయక్‌ దుర్మరణం చెందారు. యువనేతగా ఆయన కర్నాటక రాజకీయాల్లో చురకైన పాత్ర పోషిస్తున్నారు. రాయచూర్‌ జిల్లా రాజకీయాల్లో ప్రముఖపాత్ర పోషించారు. ఆయన గత మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. జిల్లా పంచాయతీ సభ్యుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన అంచలంచెలుగా ఎదిగారు. అరికెర జడ్పీ సభ్యుడిగా పనిచేసిన ఆయన 1991లో రాయ్‌చూర్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా లోక్‌సభ స్థానానికి తొలిసారిగా పోటిచేసి ఘనవిజయం సాధించారు. 1996 ఎన్నికల్లోనూ తిరిగి ఎన్నికయ్యారు. 1998లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో పరిస్థితులు తారుమారై ఓటమి పాలయ్యారు. 1999లో తిరిగి పోటీచేసి మూడోసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. 2014లో దేవదుర్గ్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాయ్‌చూర్‌ జిల్లా కాంగ్రెస్‌ పీసీసీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. ఆయన కుమారుడు బీవీ నాయక్‌ ప్రస్తుతం రాయ్‌చూర్‌ పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన మృతికి పలువురు సంతాపం తెలిపారు. నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఘటనలో ఐదుగురు మృతిచెందడం బాధాకరమని రాష్ట్ర మంత్రి పరిటాల సునీత అన్నారు. మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతిచెందిన ఐదుగురిలో దేవదుర్గ్‌ ఎమ్మెల్యే వెంకటేశం ఉండడం మరింత దిగ్బాంత్రి కలిగించిందని మంత్రి అన్నారు. ఈఘటనలో లారీ డ్రైవర్‌ పరారయ్యాడని..క్లీనర్‌ మృతిచెందాడని మంత్రి అన్నారు. ప్రస్తుతం ఐదుగురి మృతదేహాలకు పోస్టుమార్టం చేసేందుకు వైద్యులు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రైలు ప్రమాదం దురదృష్టకరమని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. ఈ ప్రమాదంలో ఐదుగరు చనిపోయారని, మరో ముగ్గురు గాయపడినట్లు తెలిపారు. ఆయన అనంతపురం నుండి హైదరాబాద్‌ కు మరో రైల్లో ప్రయాణిస్తున్న సందర్భంలో ప్రమాదం జరిగిన సమాచారం అందడంతో గుంతకల్లు రైల్వే స్టేషన్‌ వద్ద ఆగిపోయారు. అక్కడ నుండి పెనుకొండకు వచ్చారు. గ్రానైట్‌ లారీ బ్రేక్‌ ఫెయిల్‌ అవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారంగా తెలుస్తోంది. విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా పెనుకొండ రైల్వే జోన్‌ లో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని… వీటి పై కేంద్రానికి ఓ లేఖ రాయనున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి, క్షతగాత్రులను ఆదుకుంటామని పేర్కొన్నారు.

ప్రమాద ఘటనపై చంద్రబాబుగ్భ్భ్రాంతి

అనంతపురం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడుగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం మంత్రి పరిటాల సునీత, జిల్లా కలెక్టరు, ఎస్పీలతో మాట్లాడారు. సీఎం ఆదేశంలో జిల్లా అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.నిలిచిపోయిన రైళ్లలోని ప్రయాణికులను తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సహాయచర్యలను ముమ్మరం చేయాలని మంత్రులు ప్లలె రఘునాథరెడ్డి, పరిటాల సునీతను ఆదేశించారు. ప్రమాదంలో మృతిచెందిన కర్ణాటకలోని దేవదుర్గ్‌ ఎమ్మెల్యే వెంకటేష్‌ నాయక్‌ మృతిపై చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గురికావడంతో బెంగళూరు- గుంతకల్లు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. షోలాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ను కల్లూరులో. ముంబయి- బెంగళూరు ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌ను తాడిచెర్లలో, బీదర్‌-యశ్వంత్‌పూర్‌ రైలును గార్లదిన్నెలో, నిజాముద్దీన్‌- బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను అనంతపురంలో నిలిపివేశారు. రైల్వే అధికారులు వచ్చి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించనున్నారు.