రైల్లోకి అక్రమంగా సిలిండర్.. టీ చేస్తుండగా పేలి 10 మంది మృతి

చెన్నై: తమిళనాడులోని మధురై రైల్వేస్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రైలులోని కిచెన్‌లో సిలిండర్‌ పేలిపోయింది. ఈ ప్రమాదంలో బోగీలో భారీగా మంటలు ఎగిసిపడటంతో ఏడుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

వివరాల ప్రకారం.. మధురై రైల్వేస్టేషన్‌లో శనివారం తెల్లవారుజామున ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ ట్రైన్‌లో మంటలు చెలరేగాయి. రైలులోని కిచెన్‌ బోగీలో సిలిండర్‌ పేలిపోయింది. అనంతరం.. గాలుల కారణంగా రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా, టూరిస్ట్‌ రైలు లక్నో నుంచి రామేశ్వరం వెళ్తోంది. ఈ క్రమంలో మధురై చేరుకుంది.ఇక, ఈ అగ్ని ‍ప్రమాదంలో ఏడుగురు మృతిచెందినట్టు తెలుస్తోంది. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో రైలులో 63 మంది యాత్రికులు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.