రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి.
రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టరు శ్రీమతి పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.
శనివారం నాడు కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టరు అధ్యక్షతన జరిగిన జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆమె అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి నెలా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించబడుతుందని, జిల్లాలో 2500 కి.మీ. మేర రోడ్డు సౌకర్యం కలిగి వుందని, ప్రమాదాలకు నివారణ చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలు జరిగే చోట, మలుపుల వద్ద ముందస్తు సూచికలు, రేడియం స్టిక్కర్స్, రంబుల్ స్టిక్స్ ఏర్పాటు చేయాలని, కల్వర్టులు, కాజ్వేలను పరిశీలించాలని, సిసి రోడ్ల ప్రమాణాలను పరీక్షించాలని తెలియచేస్తూ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని తెలిపారు. చిన్న చిన్న పనులను, గుంతలను పూడ్చడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్టీసి బస్సులు నిర్ణీత బస్ స్టాపుల వద్ద తప్పనిసరిగా ఆగేలా చర్యలు తీసుకోవాలని, అలాగే ఆర్టీసీ డ్రైవర్లు అతి వేగంగా నడపకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, అన్ని ఆర్టీసి బస్సులలో ఫస్ట్ ఎయిడ్ బాక్సులలో మందులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్కూల్ బస్సులలో మందులతో కూడిన ఫస్ట్ ఎయిడ్స్ బాక్సుతో పాటు డ్రైవరు కాకుండా.. ఒక సహాయకుడు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఓవర్ లోడ్ వాహనాల పట్ల తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గూడూరు టోల్ గేట్ వద్ద తప్పనిసరిగా సిసి కెమెరాల ఏర్పాటు ఉండాలని, టోల్ గేట్ వద్ద రోడ్డుకిరువైపులా ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తూ అమ్మకాలు జరుపుతున్న వారిని వెంటనే తొలగించాలని, ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని నేషనల్ హైవే మేనేజరును ఆదేశించారు. లైన్ డిపార్టుమెంట్స్ అధికారులు సమన్వయంతో యువజన సంఘాలు, స్వచ్చంద సంస్థల తోడ్పాటుతో రోడ్డు భద్రత పట్ల తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.
సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు రీపక్ తివారీ, జిల్లా రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు శంకరయ్య, పంచాయితీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వెంకటేశ్వర్లు, జిల్లా రోడ్డు రవాణా అధికారి సురేందర్రెడ్డి, జిల్లా వైద్య అధికారి డాక్టర్ మల్లిఖార్జునరావు, భువనగిరి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ చిన్నా నాయక్, భువనగిరి మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, కోఆర్డినేటరు డాక్టర్ వినోద్, ఆర్టీసి డిపో మేనేజరు శ్రీనివాన్, నేషనల్ హైవే మేనేజరు తేజోనిధి, మున్సిపల్ ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.